పోస్టింగ్‌లు ఇవ్వకుండా వీఆర్‌లో ఉంచింది
హైకోర్టులో తిరుపతి ఎంపీ గురుమూర్తి పిల్
సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాలన్న హైకోర్టు
సాక్షి, అమరావతి: రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులను వేకెన్సీ రిజర్వ్ (వీఆర్)లో ఉంచి ఎలాంటి జీతాలు చెల్లించకపోవడాన్ని ప్రశ్నిస్తూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది.
గురుమూర్తి తరఫు న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘‘విధి నిర్వహణలో నిక్కచి్చగా వ్యవహరిస్తారనే పేరున్న పోలీసు అధికారులను చాలాకాలంగా ప్రభుత్వం వీఆర్‌లో ఉంచింది. ప్రభుత్వం సహేతుక కారణాలు లేకుండానే ఇలా చేసింది. ఇది చట్ట విరుద్ధం. 199 మంది అధికారులకు జీతభత్యాలు అందడం లేదు. వారి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి.
పోలీసు సంస్కరణల విషయమై ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని ప్రతి రాష్ట్రం పాటించాల్సి ఉంది’’ అని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, ప్రకాశ్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదంటే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికే తీసుకెళ్లాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది.
జీతాలు అందక ఇబ్బందులు పడుతుంటే సంబంధిత పోలీసు అధికారులే కోర్టుకు వస్తారని, వారి తరఫున వ్యాజ్యాన్ని దాఖలు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడమే మేలని పిటిషనర్‌కు సూచించింది.


