బాలయ్యా.. ఇటువైపూ చూడయ్యా..

బాలయ్యా.. ఇటువైపూ చూడయ్యా.. - Sakshi


- సినిమా షూటింగుల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ బిజీ

- హిందూపురం వైపు కన్నెత్తి చూడని వైనం

- మునిసిపల్‌ కార్యాలయంలో కొనసాగుతున్న కోల్డ్‌వార్‌

- పరిష్కారానికి నోచుకోని ప్రజాసమస్యలు

- ఎవరికి విన్నవించుకోవాలో తెలియక జనం అవస్థలు
హిందూపురం అర్బన్‌ : సీఎం చంద్రబాబు వియ్యంకుడు, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రజలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా పరిష్కరించే నాథులే కరువయ్యారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సినిమా షూటింగ్‌లకే పరిమితమై నియోజకవర్గానికి చుట్టపుచూపుగానే వస్తున్నారు. మరోవైపు స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులైనా పట్టించుకుంటున్నారా అంటే అదీ లేదు. వారు ఆధిపత్యపోరు, వర్గ విభేదాల్లో మునిగితేలుతూ ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నారు. హిందూపురం పట్టణంలో తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. లేపాక్షి మండల కేంద్రంలో నంది ఉత్సవాల సందర్భంగా మొదలుపెట్టిన రోడ్ల నిర్మాణం ఇప్పటికీ పూర్తికాలేదు. ఎన్నికల సమయంలో బాలయ్య ఇచ్చిన అనేక హామీలు అమలుకు నోచుకోలేదు.ఎవరికి వారే యమునా తీరే..

నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా మారింది. బాలయ్య పాలన మొత్తం ఇంతకుముందు పీఏ శేఖర్‌ చేతుల్లో పెట్టగా.. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆయన అవినీతిపై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేసి..చివరకు సాగనంపారు. ఈ వివాదం సమసిపోయిందనుకున్న తరుణంలోనే మునిసిపాలిటీలో పోరు మొదలైంది.  పీఏ శేఖర్‌ స్థానికంగా ఉన్న సమయంలో మునిసిపాలిటీలో కూడా పెత్తనం చెలాయించారు.  కమిషనర్‌ విశ్వనాథ్‌తో పాటు కొందరు కౌన్సిలర్లు కూడా ఆయనకు సహకారం అందించారు.  శేఖర్‌ పెత్తనానికి చైర్‌పర్సన్ లక్ష్మి, ఆమె భర్త నాగరాజు ఎప్పటికప్పుడు  అడ్డు తగులుతూ వచ్చారు. ఈ క్రమంలోనే చైర్‌పర్సన్‌, కమిషనర్‌ మధ్య దూరం మరింత పెరిగింది.మొదలైందిలా..

గతంలో ఎలాంటి అనుమతులు లేకుండా శానిటేషన్‌ సిబ్బందితో రాత్రి విధులు నిర్వహిస్తూ వచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధమని కమిషనర్‌ నైట్‌ శానిటేషన్‌ను రద్దు చేశారు. దీంతో కమిషనర్‌, చైర్‌పర్సన్‌ మధ్య అం‍తర్యుద్ధం మొదలైంది. అంతేకాకుండా ఏ పథకం కింద నిధులు వచ్చినా గతంలో అనుకూలమైన కాంట్రాక్టర్లకే ‍కమిషనర్‌ బిల్లులు మంజూరు చేశారు. అలాగే శానిటేషన్‌ సిబ్బందికి బయోమెట్రిక్‌ విధానం అమలు చేయడాన్ని వ్యతిరేకించారు. ఈ విషయం ఇద్దరి మధ్య సఖ్యతను దెబ్బతీసింది. కాగా.. అసమ్మతి నేపథ్యంలో పీఏ శేఖర్‌ అడ్డు తొలగిపోవడంతో తన మాట వినని మునిసిపల్‌ కమిషనర్‌ను చైర్‌పర్సన్‌ వర్గం టార్గెట్‌ చేసింది. ఎలాగైనా బదిలీ చేయించాలని తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి విభేదాల కారణంగా పట్టణ పాలన పడకేసింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top