‘హరిత’ మొక్కలపై విద్యార్థులతో సర్వే
హరితహారంలో భాగంగా 40 వేల మొక్కలు నాటిన 150 గ్రామపంచాయతీల్లో గిరిరాజ్ డిగ్రీ, పీజీ విద్యార్థులతో క్షేత్ర స్థాయి పరిశీలన జరిపించనున్నట్లు కలెక్టర్ యోగితారాణా వెల్లడించారు.
-
కలెక్టర్ యోగితారాణా వెల్లడి
-
గ్రామాల్లో పర్యటించనున్న జీజీ కాలేజీ స్టూడెంట్స్
-
నాటిన మొక్కలు, కంచె ఏర్పాట్లపై పరిశీలన
నిజామాబాద్ అర్బన్ : హరితహారంలో భాగంగా 40 వేల మొక్కలు నాటిన 150 గ్రామపంచాయతీల్లో గిరిరాజ్ డిగ్రీ, పీజీ విద్యార్థులతో క్షేత్ర స్థాయి పరిశీలన జరిపించనున్నట్లు కలెక్టర్ యోగితారాణా వెల్లడించారు. ప్రభుత్వానికి ఇచ్చిన లెక్కలపై వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు హరితహారం అమలులో ఏర్పడే అవాంతరాలను అధిగమించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. శనివారం గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో కలెక్టర్ మొక్కలు నాటిన అనంతరం విద్యార్థులకు హరితహారం ప్రాధాన్యతను వివరించారు. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని, సరిపడా నీటిని అందించేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమమే హరితహారం అని తెలిపారు. చెట్లు కనుమరుగై, వర్షాలు లేకపోవడంతో మహారాష్ట్రలోని లాథూర్ జిల్లాకు రైలు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాల్సి వచ్చిందని, అలాంటి పరిస్థితి మనకు రానీయొద్దన్నారు. కుటుంబం పట్ల ఎంత బాధ్యతతో ఉంటామో, అంతే బాధ్యతతో నాటిన ప్రతి మొక్కను కాపాడాలని సూచించారు.
ఒక్కో గ్రామంలో ఇద్దరు విద్యార్థులతో సర్వే..
ఒక్కో గ్రామ పంచాయతీకి ఇద్దరు విద్యార్థులను కేటాయించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆయా గ్రామాల్లో నాటిన మొక్కలను విద్యార్థులు రెండ్రోజుల పాటు పరిశీలించాలన్నారు. నాటిన మొక్కలు, రక్షణకు ఏర్పాటు చేసిన కంచె, అమలులో నెలకొన్న వాస్తవ పరిస్థితులపై నివేదిక సమర్పించాలని సూచించారు. సామాజిక బాధ్యతతో ఈ సర్వే కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. గ్రామజ్యోతి కింద పోలీసులు దత్తత తీసుకున్న గ్రామాలలో 10 వేల మొక్కల చొప్పున పెంచుతున్నట్లు నిజామాబాద్ డీఎస్పీ ఆనంద్‌కుమార్ తెలిపారు. ప్రతి పోలీసుస్టేషన్‌ను ఆహ్లాదకరంగా ఉంచేందుకు హరితహారాన్ని తమ విధి నిర్వహణలో భాగంగా చేసినట్లు చెప్పారు. ఎన్‌సీఎల్‌పీ పీడీ సుధాకర్, కళాశాల ప్రిన్సిపల్ రాంమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.