తిరుమల దేవర ఆలయం.. చూసొద్దాం రండి | Sakshi
Sakshi News home page

తిరుమల దేవర ఆలయం.. చూసొద్దాం రండి

Published Fri, May 26 2017 11:52 PM

తిరుమల దేవర ఆలయం.. చూసొద్దాం రండి

జిల్లాలోని ప్రముఖ చూడదగ్గ ఆలయాల్లో తిరుమల దేవర ఆలయం ఒకటి. వందల ఏళ్లనాటి చరిత్ర ఉన్న ఈ ఆలయం చెన్నేకొత్తపల్లి మండలంలోని జాతీయ రహదారిపై ఉన్న ఎన్‌ఎస్‌గేట్‌ నుంచి రామగిరి మండలంలోని పేరూరుకు వెళ్లే రహదారి పక్కనే గంగంపల్లి వద్ద ఉంది. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఈ మార్గం గుండా ప్రత్యేక బస్సులు నడుస్తుంటాయి. నసనకోట పంచాయతీలోని ముత్యాలంపల్లిలో ఉన్న ముత్యాలమ్మ ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా తిరుమల దేవర ఆలయాన్ని సందర్శించుకుంటుంటారు.

వారంలో మూడురోజులు భక్తులతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొని ఉంటుంది. ఇక్కడ వేంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఆంజనేయస్వామి గుడి కూడా ఉంది. జిల్లా కేంద్రం అనంతపురం నుంచి 70కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఆలయాన్ని చేరుకోవచ్చు. ఇక్కడకు వచ్చిన తర్వాత సమీపంలోనే నసనకోట ముత్యాలమ్మ ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. అటు నుంచి మరో 15 కిలోమీటర్లు ప్రయాణించి పేరూరు డ్యాంను కూడా చూడవచ్చు.
- రామగిరి (రాప్తాడు)

Advertisement
Advertisement