breaking news
nasanakota
-
పరిటాల కుటుంబ దోపిడీకి అడ్డుకట్ట..
ప్రసిద్ధ నసనకోట ముత్యాలమ్మ ఆలయ ఆదాయాన్ని ఆలయ కమిటీ ముసుగులో దోచేశారు. మాజీ మంత్రి పరిటాల కుటుంబ సభ్యుల అధీనంలో పాతికేళ్లు ఆలయ నిర్వహణ కొనసాగింది. భక్తుల నుంచి ముడుపులు, కానుకలతో పాటు ఆలయ గదుల అద్దెలు, దుకాణాల వేలం పాట ద్వారా సమకూరిన ఆదాయాన్ని దిగమింగేశారు. నామమాత్రంగా ఆదాయం చూపుతూ భక్తులు అమ్మవారికి సమర్పించిన అత్యంత విలువైన బంగారు, వెండి ఆభరణాలతో పాటు చెక్కులు, డీడీల రూపంలోని చందాలను ఎంచక్కా ఇళ్లకు చేర్చుకున్నారు. ఎట్టకేలకు ఆలయాన్ని దేవదాయ శాఖ పరిధిలోకి తేవడంతో దోపిyీ కి చెక్ పడింది. రామగిరి: కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా రామగిరి మండలం నసనకోట ముత్యాలమ్మ పూజలందుకుంటోంది. జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల్లో నసనకోట ఒకటి. ఇక్కడికి జిల్లా వ్యాప్తంగానే కాక తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ప్రతి ఆది, మంగళ, శుక్ర వారాల్లో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ముత్యాలమ్మ అమ్మవారికి కానుకల రూపంలో నగదు, చీర, సారెతో పాటు బంగారు, వెండి ఆభరణాలు సమర్పిస్తుంటారు. రూ.లక్షల్లో ఆదాయం ఉంటున్నా రికార్డుల్లో మాత్రం నమోదు కాలేదు. పాతికేళ్లుగా పరిటాల కుటుంబ సభ్యుల అధీనంలోనే కొనసాగుతూ వచ్చింది. చందాలు, కానుకల రూపంలో వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి గానీ, నసనకోట గ్రామ అభివృద్ధికి గానీ వినియోగించిన దాఖలాలు లేవు. పాతికేళ్లుగా దోపిడీ.. మహిమాన్విత నసనకోట ముత్యాలమ్మ ఆలయం మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబం అధీనంలోనే పాతికేళ్లుగా ఉండేది. పరిటాల అనుచరులు, కుటుంబ సభ్యులే ఆలయ కమిటీ పేరుతో చెలామణి అయ్యేవారు. కమిటీ పేరుతో ఏడాదికి ఒకసారి ఆలయ గదులు, హుండీ, కానుకలు, కొబ్బరి కాయలు, మద్యం విక్రయం తదితర వాటికి వేలం వేసి నామమాత్రపు ఆదాయం చూపేవారు. భక్తులు అమ్మవారికి ప్రత్యేక కానుకలను సమర్పించడానికి వచ్చిన అనేక సందర్భాలలో కమిటీ సభ్యులు ఇంటి వద్దకే పిలిపించుకునే వారు. చెక్కులు, బంగారు, వెండి ఆభరణాలు ఆలయానికి వినియోగిస్తామని నమ్మబలికి భక్తుల నుంచి తీసుకునేవారు. ఆలయ కానుకలు, ఆదాయాన్ని భారీగా దోపిడీ చేస్తున్నారంటూ ప్రస్తుత రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆందోళన చేశారు. భక్తులు అందజేసిన బంగారు ఆభరణాలను కర్ణాటక రాష్ట్రం కొత్తకోటలో విక్రయిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులే ఆరోపించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు దేవదాయ శాఖ పరిధిలోకి.. రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చొరవతో నసనకోట ముత్యాలమ్మ ఆలయాన్ని నాలుగు నెలల కిందట దేవదాయ శాఖ పరిధిలోకి తీసుకొచ్చారు. అయినప్పటికీ పరిటాల అనుచరులే పెత్తనం సాగిస్తూ వచ్చారు. ఎట్టకేలకు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి పది రోజులకు సంబంధించిన హుండీ కానుకలను ఈ నెల ఏడో తేదీన లెక్కించారు. అదీ మాఘమాసం.. జంతు బలులు తక్కువ ఇచ్చే సమయంలో రూ.77,343 ఆదాయం వచ్చినట్లు ఈఓ నర్సయ్య తెలిపారు. మిగతా రోజుల్లో హుండీ కానుకల ఆదాయం భారీగా ఉంటుందనేది తేటతెల్లమైంది. దేవదాయ శాఖ పరిధిలోకి వచ్చిన తర్వాత పరిటాల కుటుంబ కబంధ హస్తాల చెర నుంచి ముత్యాలమ్మ ఆలయానికి విముక్తి కలిగినట్లయ్యిందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇక నుంచైనా ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు ఆలయ ఆదాయాన్ని వినియోగించాలని ప్రజలు కోరుతున్నారు. -
పరిటాల కుటుంబంతో ప్రాణహాని
సాక్షి, అనంతపురం : రాప్తాడు నియోజకవర్గంలో ఓటమిని జీర్ణించుకోలేక పరిటాల శ్రీరామ్, అతని అనుచరులు దాడులకు పాల్పడుతున్నారని నసనకోట గ్రామస్తులు ఆరోపించారు. పరిటాల కుటుంబ అరాచకాలపై శనివారం వారు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. రామగిరి మండలం నసనకోటలో ఈ నెల 4న వినాయక నిమజ్జనం అనంతరం తిరిగి ఇళ్లకు వెళ్తుండగా వెంకటాపురం నుంచి పరిటాల శ్రీరామ్ అనుచరులు ట్రాక్టర్లు, వాహనాలలో 50 మందికి పైగా వచ్చి మారణాయుధాలతో విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారని తెలిపారు. బోయ సూర్యం అనే వ్యక్తిని హత్య చేయడానికి కుట్ర జరిగిందని, అయితే చనిపోయాడనుకోని అతడిని వదిలేసి వెళ్లారని వివరించారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారని, ప్రాణభయంతో ఇళ్లలోకి పరుగులు తీశామని తెలిపారు. ఉనికి కోసమే దాడులు రామగిరి మండలంలో ఉనికి కోల్పోతున్నామనే కారణంతోనే పరిటాల శ్రీరామ్ ఈ దాడులు చేయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గతంలో కూడా పేరూరు బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చితకబాదారని గుర్తు చేశారు. రామగిరి మండలం తమకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నా చంపుతామని బెదిరిస్తున్నారని, అరాచకశక్తిలా తయారవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిటాల శ్రీరామ్, అతని అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నసనకోట గ్రామస్తులు ముత్యాలప్ప, కేశవనారాయణ, రామలింగారెడ్డి, బండారు లింగన్న, ముత్యాలు, మహిళలు రత్న, సావిత్రమ్మ, ముత్యాలమ్మ, రంగమ్మ, పి. ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇది చదవండి : పరిటాల వర్గీయుల హింసా రాజకీయాలు -
తిరుమల దేవర ఆలయం.. చూసొద్దాం రండి
జిల్లాలోని ప్రముఖ చూడదగ్గ ఆలయాల్లో తిరుమల దేవర ఆలయం ఒకటి. వందల ఏళ్లనాటి చరిత్ర ఉన్న ఈ ఆలయం చెన్నేకొత్తపల్లి మండలంలోని జాతీయ రహదారిపై ఉన్న ఎన్ఎస్గేట్ నుంచి రామగిరి మండలంలోని పేరూరుకు వెళ్లే రహదారి పక్కనే గంగంపల్లి వద్ద ఉంది. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఈ మార్గం గుండా ప్రత్యేక బస్సులు నడుస్తుంటాయి. నసనకోట పంచాయతీలోని ముత్యాలంపల్లిలో ఉన్న ముత్యాలమ్మ ఆలయానికి వచ్చే భక్తులు ముందుగా తిరుమల దేవర ఆలయాన్ని సందర్శించుకుంటుంటారు. వారంలో మూడురోజులు భక్తులతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొని ఉంటుంది. ఇక్కడ వేంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ఆంజనేయస్వామి గుడి కూడా ఉంది. జిల్లా కేంద్రం అనంతపురం నుంచి 70కిలోమీటర్లు దూరం ప్రయాణించి ఆలయాన్ని చేరుకోవచ్చు. ఇక్కడకు వచ్చిన తర్వాత సమీపంలోనే నసనకోట ముత్యాలమ్మ ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. అటు నుంచి మరో 15 కిలోమీటర్లు ప్రయాణించి పేరూరు డ్యాంను కూడా చూడవచ్చు. - రామగిరి (రాప్తాడు)