ప్రాణాలు తీసిన రాంగ్‌రూట్‌ | Student killed in road accident | Sakshi
Sakshi News home page

ప్రాణాలు తీసిన రాంగ్‌రూట్‌

Oct 14 2016 2:06 AM | Updated on Oct 20 2018 6:19 PM

ప్రాణాలు తీసిన రాంగ్‌రూట్‌ - Sakshi

ప్రాణాలు తీసిన రాంగ్‌రూట్‌

నెల్లూరు (క్రైమ్‌) : రాంగ్‌రూట్‌లో మితిమీరిన వేగంతో వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొంది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న చెల్లెలు దుర్మరణం చెందగా, అన్న తీవ్రగాయాలతో ప్రాణాపాయంతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు.

 
  •  స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
  • చెల్లెలు దుర్మరణం
  •  అన్నకు తీవ్రగాయాలు ..పరిస్థితి విషమం 
 
నెల్లూరు (క్రైమ్‌) :
రాంగ్‌రూట్‌లో మితిమీరిన వేగంతో వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొంది. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న చెల్లెలు దుర్మరణం చెందగా, అన్న తీవ్రగాయాలతో ప్రాణాపాయంతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాద సంఘటన ఆత్మకూరు బస్టాండ్‌ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. కోవూరు మండలం లేగుంటపాడుకు చెందిన నాగిరెడ్డి మల్లికార్జునరెడ్డి, విజయ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె తేజస్విని (17) ప్రస్తుతం ఆమె నారాయణ మెడికల్‌ కళాశాలలో బిఫార్మసీ మొదటి సంవత్సరం చదువుతోంది. మూడు రోజుల కిందట విజయ తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఆమెను చికిత్స నిమిత్తం నారాయణ హాస్పిటల్‌లో చేర్పించారు. అప్పటి నుంచి ప్రతి రోజు రాత్రి ఎవరో ఒకరు ఆమెకు తోడుగా హాస్పిటల్‌లో ఉండేవారు. ఈ నేపథ్యంలో మల్లికార్జునరెడ్డి బుధవారం రాత్రి విజయకు తోడుగా ఉండాలని తన తమ్ముడు కుమారుడు అభిలాష్, కుమార్తె తేజశ్వినిని హాస్పిటల్‌కు పంపాడు. దీంతో అన్న, చెల్లెలు ఇద్దరూ రాత్రంతా హాస్పిటల్‌లో ఉన్నారు. గురువారం తెల్లవారు జామున మల్లికార్జునరెడ్డి హాస్పిటల్‌కు వచ్చాడు. అభిలాష్‌, తేజశ్వినిని ఇంటికి వెళ్లమని చెప్పడంతో ఇద్దరు తమ స్కూటీపై బయలుదేరారు. ఆత్మకూరు బస్టాండ్‌ మీదుగా వెళ్తుండగా మినీ లారీస్టాండ్‌ వద్దకు వచ్చేసరికి ఎదురుగా రాంగ్‌రూట్‌లో నెల్లూరు టూ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొంది. దీంతో అన్నా చెల్లెలు ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. బస్సు ముందు చక్రం తేజశ్విని తలపైకి ఎక్కడంతో తల పగిలి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అభిలాష్‌కు తీవ్రగాయాలయ్యాయి.   స్థానికులు 108కు, నార్త్‌ ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం అందించారు. నార్త్‌ ట్రాఫిక్‌ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడు అభిలాష్‌రెడ్డిని చికిత్స నిమిత్తం సింహపురి హాస్పిటల్‌కు తరలించారు. సంఘటనా స్థలాన్ని నార్త్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ కొండయ్య, ఏఎస్‌ఐ రమణయ్య పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డీఎస్‌ఆర్‌ ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ రమణయ్యను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. నార్త్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ కొండయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. 
శోకసంద్రంలో కుటుంబసభ్యులు 
తేజశ్విని మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒక్కగానొక్క కుమార్తె మృతిని జీర్ణించుకోలేక తండ్రి కుప్పకూలిపోయాడు. తమ ఆశలన్నీ కల్లలైపోయాయని కన్నీటి పర్యంతమయ్యారు. కుమార్తె మృతి విషయం తెలుసుకున్న విజయ సైతం గుండెలవిసేలా రోదించింది. అభిలాష్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అభిలాష్‌రెడ్డి చెన్నైలోని పరిమళ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాలకు దసరా సెలవలు కావడంతో ఇంటికి వచ్చాడు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement