కౌలు రైతులంటే వివక్షా? | Rented farming farmers facing loan problems | Sakshi
Sakshi News home page

కౌలు రైతులంటే వివక్షా?

Aug 10 2016 10:38 PM | Updated on Sep 4 2017 8:43 AM

కౌలు రైతులంటే వివక్షా?

కౌలు రైతులంటే వివక్షా?

సర్కారు తీరుపై కౌలు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణాల మంజూరులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. సమస్యల పరిష్కారంలో వివక్షను వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు.

పంట రుణాల మంజూరులో నిర్లక్ష్యం
ఇవ్వాల్సింది రూ.4 వేల కోట్లు.. ఇచ్చింది రూ.2 కోట్లు
రుణమాఫీ చేసి.. కొత్త రుణాలివ్వాలి
75 మంది ఆత్మహత్య చేసుకుంటే నలుగురికే పరిహారం
సర్కారు తీరుకు నిరసనగా కౌలు రైతుల ధర్నా
 
గుంటూరు ఎడ్యుకేషన్‌ : సర్కారు తీరుపై కౌలు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణాల మంజూరులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. సమస్యల పరిష్కారంలో వివక్షను వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. కౌలు రైతుల సంఘ రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పంట రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని, కౌలు రైతులకు పంట బీమా పథకం గడువును పొడిగించి, ప్రభుత్వ పరంగా కల్పించాల్సిన సబ్సిడీలను అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది కౌలు రైతుల్లో 11 లక్షల మందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, వ్యవసాయ సీజన్‌ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో కేవలం 2.20 లక్షల మందికి కార్డులు ఇచ్చారని పేర్కొన్నారు. వీరిలో 2 శాతం మందికే పంట రుణాలు మంజూరు చేశారని, ఈ పరిస్థితుల్లో దిక్కుతోచని కౌలు రైతులు ప్రై వేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
దుర్భరంగా కౌలు రైతుల జీవితం...
సంఘ జిల్లా కార్యదర్శి కె.అజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో కౌలు రైతుల జీవితం దుర్భరంగా మారుతోందన్నారు. జిల్లాలో మూడు లక్షలకుగా పైగా కౌలు రైతులు ఉండగా కేవలం 25 వేల మందికి గుర్తింపు కార్డులు ఇచ్చారని విమర్శించారు. జిల్లాకు రూ.6 వేల కోట్ల వ్యవసాయ రుణాలు కేటాయించగా, 70 శాతానికి పైగా ఉన్న కౌలు రైతులకు రూ.4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని, రూ.2 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో 75 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోగా వారిలో నలుగురికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారన్నారు. ఇప్పటికైనా కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement