breaking news
rented farming farmers
-
అప్పులు తీర్చలేక... బతకలేక!
పాములపాడు: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కూటమి సర్కారు నిర్లక్ష్యం కారణంగా గిట్టుబాటు ధరలు లభించడం లేదు. రైతులు, కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అప్పులు తీర్చేమార్గం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రైతులు, కౌలు రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాల ఘటనలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా అప్పుల బాధతో ఓ కౌలు రైతు తన కన్నతల్లి, కట్టుకున్న భార్య, ఇద్దరు పిల్లలకు పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, ఆ తర్వాత అతను కూడా తాగి ఆత్మహత్యకు ప్రయత్నింనంచాడు. నంద్యాల జిల్లాలో నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన సోమేశ్వరుడు 10 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని పలు పంటలు సాగు చేశాడు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడం, చేతికొచ్చిన పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రూ.10 లక్షలకు పైగా అప్పులపాలయ్యాడు. దీంతో అప్పులు తీర్చలేనని తీవ్ర మనస్తాపానికి గురైన సోమేశ్వరుడు తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. గురువారం మధ్యాహ్నం కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి తన తల్లి శివమ్మ, భార్య లావణ్య, కూతురు నిఖిత(9), కుమారుడు భరత్(7)కు ఇచ్చాడు. వారు తాగిన తర్వాత తాను కూడా ఆ కూల్ డ్రింక్ తాగాడు. అదే రోజు రాత్రి ఐదుగురు తీవ్ర అస్వస్థతకు గురి కాగా, పాములపాడు ఆస్పత్రికి వెళ్లారు. ‘రాత్రి మిగిలిన అన్నం తినడంతో అస్వస్థతకు గురయ్యాం’ అని సోమేశ్వరుడు చెప్పాడు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ‘కలుషిత ఆహారంతో ఐదుగురికి అస్వస్థత’ అని పత్రికల్లో వార్తలు రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం తహసీల్దార్ సుభద్రమ్మ, ఎంపీడీవో చంద్రశేఖర్ కర్నూలు ఆస్పత్రికి వెళ్లి సోమేశ్వరుడిని పరామర్శించారు. ఐదుగురి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు కలుషిత ఆహారం వల్ల వారు అస్వస్థతకు గురి కాలేదని నిర్ధారించి, గట్టిగా నిలదీయడంతో పురుగులమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సోమేశ్వరుడు అంగీకరించాడు. ప్రస్తుతం ఐదుగురి కిడ్నీల పనితీరు బాగాలేదని, వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పినట్లు ఎంపీడీవో తెలిపారు. -
కౌలు రైతులంటే వివక్షా?
పంట రుణాల మంజూరులో నిర్లక్ష్యం ఇవ్వాల్సింది రూ.4 వేల కోట్లు.. ఇచ్చింది రూ.2 కోట్లు రుణమాఫీ చేసి.. కొత్త రుణాలివ్వాలి 75 మంది ఆత్మహత్య చేసుకుంటే నలుగురికే పరిహారం సర్కారు తీరుకు నిరసనగా కౌలు రైతుల ధర్నా గుంటూరు ఎడ్యుకేషన్ : సర్కారు తీరుపై కౌలు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణాల మంజూరులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. సమస్యల పరిష్కారంలో వివక్షను వ్యతిరేకిస్తూ బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. కౌలు రైతుల సంఘ రాష్ట్ర కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని, కౌలు రైతులకు పంట బీమా పథకం గడువును పొడిగించి, ప్రభుత్వ పరంగా కల్పించాల్సిన సబ్సిడీలను అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది కౌలు రైతుల్లో 11 లక్షల మందికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, వ్యవసాయ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో కేవలం 2.20 లక్షల మందికి కార్డులు ఇచ్చారని పేర్కొన్నారు. వీరిలో 2 శాతం మందికే పంట రుణాలు మంజూరు చేశారని, ఈ పరిస్థితుల్లో దిక్కుతోచని కౌలు రైతులు ప్రై వేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్భరంగా కౌలు రైతుల జీవితం... సంఘ జిల్లా కార్యదర్శి కె.అజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో కౌలు రైతుల జీవితం దుర్భరంగా మారుతోందన్నారు. జిల్లాలో మూడు లక్షలకుగా పైగా కౌలు రైతులు ఉండగా కేవలం 25 వేల మందికి గుర్తింపు కార్డులు ఇచ్చారని విమర్శించారు. జిల్లాకు రూ.6 వేల కోట్ల వ్యవసాయ రుణాలు కేటాయించగా, 70 శాతానికి పైగా ఉన్న కౌలు రైతులకు రూ.4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని, రూ.2 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో 75 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకోగా వారిలో నలుగురికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారన్నారు. ఇప్పటికైనా కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.