రాయదుర్గం - కళ్యాణదుర్గం రైలుమార్గం తనిఖీ
రాయదుర్గం నుంచి టుంకూరుకు నూతన రైలుమార్గంలో భాగంగా కళ్యాణదుర్గం వరకు పూర్తయిన మార్గాన్ని సౌత్ వెస్ట్రన్ రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే సేఫ్టీ అధికారులు గురువారం లాంఛనంగా తనిఖీ చేశారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ మనోహరన్, హుబ్లి డివిజన్ రైల్వే మేనేజర్ ఏకే జైన్, సీఆర్‌ఓ అశోక్‌గుప్తతోపాటు ఇతర ముఖ్య రైల్వే అధికారులు హాజరయ్యారు.
- హాజరైన సీఆర్‌ఏ, డీఆర్‌ఎం
- నేడు రైలు స్పీడ్ రన్
రాయదుర్గం టౌన్ :
రాయదుర్గం నుంచి టుంకూరుకు నూతన రైలుమార్గంలో భాగంగా కళ్యాణదుర్గం వరకు పూర్తయిన మార్గాన్ని సౌత్ వెస్ట్రన్ రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే సేఫ్టీ అధికారులు గురువారం లాంఛనంగా తనిఖీ చేశారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ మనోహరన్, హుబ్లి డివిజన్ రైల్వే మేనేజర్ ఏకే జైన్, సీఆర్‌ఓ అశోక్‌గుప్తతోపాటు ఇతర ముఖ్య రైల్వే అధికారులు హాజరయ్యారు.
వీరంతా ప్రత్యేక రైలులో బెంగళూరు నుంచి ఉదయం 7 గంటలకు రాయదుర్గం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. తొలుత రైలుమార్గం వివరాలు, ఇతరత్రా టెక్నికల్ వివరాలను సేకరించారు. అనంతరం కొత్త రైలుమార్గానికి పూజలు నిర్వహించి ఐదు ట్రాలీల్లో తనిఖీకి వెళ్లారు. అంతకుముందు డీఆర్‌ఎం ఏకే జైన్ మాట్లాడుతూ రాయదుర్గం నుంచి టుంకూరు రైలుమార్గంలో (205 కిలోమీటర్ల దూరం) ఇప్పటిదాకా 40 కిలోమీటర్ల పరిధిలోని కళ్యాణదుర్గం వరకు రైలుమార్గం పూర్తయిందన్నారు.
గురు, శుక్రరాల్లో ఇక్కడే బస చేసి భద్రతా ప్రమాణాలు, ఇతర నాణ్యత విషయాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు చెప్పారు. మొదటిరోజు వేదావతి బ్రిడ్జి దాకా వెళ్లి పరిశీలిస్తామని, శుక్రవారం తనిఖీ పూర్తి చేసి రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం, తిరిగి కళ్యాణదుర్గం నుంచి రాయదుర్గం వరకు రైలు స్పీడ్ ట్రైల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. తనిఖీ నివేదికను రైల్వే ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. త్వరలో ప్రయాణీకుల అవసరాన్ని బట్టి బళ్లారి లేదా గుంతకల్లు నుంచి రాయదుర్గం మీదుగా కళ్యాణదుర్గం వరకు ఒక ప్యాసింజర్ రైలు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. కాగా, 1982లో శంకుస్థాపన చేసిన రాయదుర్గం-టుంకూరు రైలుమార్గానికి ప్రతియేటా బడ్జెట్ కేటాయింపులు నామమాత్రంగా ఉండటంతో రైలుమార్గం పూర్తి చేయడంలో జాప్యం జరుగుతూ వస్తోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత కేవలం 40 కిలోమీటర్ల మేర అంటే రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం వరకు పూర్తిస్థాయిలో రైలుమార్గం అందుబాటులోకి వచ్చింది. ఏది ఏమైనా ఇరురాష్ట్ర ప్రభుత్వాలు రైలుమార్గం పూర్తి చేసేందుకు పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేస్తే టుంకూరు రైలుమార్గం పూర్తవుతుంది.