రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో భూమి వేలం
రూ.164.56 కోట్లు పలికిన ఎకరం భూమి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని రాయ దుర్గం నాలెడ్జ్ సిటీలో తెలంగాణ రాష్ట్ర పారి శ్రామిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) నిర్వహించిన వేలం పాట మరోమారు ఖజానాకు కాసుల వర్షం కురిపించింది. టీజీఐఐసీ సోమవారం సుమారు ఎకరం భూమిని వేలం వేయగా ఒక్కో చదరపు గజం రూ.3.40 లక్షలు పలికింది.
అగ్రశ్రేణి సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారడాన్ని ప్రస్తుత వేలం మరింత బలోపేతం చేస్తుందని టీజీఐఐసీ వీసీ, ఎండీ కె.శశాంక ప్రకటించారు. హైదరాబాద్‌లో అధిక రాబడిని ఇచ్చే వ్యాపార కారిడార్‌లో ప్రధాన స్థలాలను దక్కించుకునేందుకు డెవలపర్లు వ్యూహాత్మకంగా కీలక పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
అప్‌సెట్ ధరపై రూ.30 వేలు అధికంగా..
నాలెడ్జ్ సిటీలోని లే ఔట్‌లో సుమారు ఎకరం భూమిని వేలం వేసేందుకు టీజీఐఐసీ గత నెల 16న నోటిఫికేషన్ జారీ చేసింది. రాయదుర్గం పాన్‌మక్తాలోని సర్వే నంబర్ 83/1లోని 14ఏ/1, 14బీ/1 ప్లాట్లను (4,718.22 చదరపు గజాలు) వేలం వేస్తున్నట్లు ప్రకటించింది. ఒక్కో చదరపు గజం అప్‌సెట్ ధర (వేలం ప్రారంభ ధర)ను రూ.3.10 లక్షలుగా (ఎకరం ధర రూ.146 కోట్లు) నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో సోమవారం జరిగిన వేలంలో ఎకరం ధర రూ.200 కోట్ల మార్క్‌ను అధిగమిస్తుందని టీజీఐఐసీ వర్గాలు అంచనా వేసినా.. రూ.164.56 కోట్లు మాత్రమే పలికింది. నిర్ణయించిన అప్‌సెట్ ధర పరంగా చూస్తే ఒక్కో చదరపు గజానికి అదనంగా రూ.30 వేలు పలికింది. కాగా అక్టోబర్ మొదటి వారంలో రెండు ల్యాండ్ పార్శిళ్ల కింద సుమారు 19 ఎకరాలకు నిర్వహించిన వేలంలో ఖజానాకు రూ.3,135 కోట్లు సమకూరాయి. ఎకరం ధర గరిష్టంగా రూ.177 కోట్లు పలికింది.


