breaking news
Speed Run
-
సూపర్‌మ్యాన్ స్పీడ్.. ఉసేన్ బోల్ట్ రికార్డు బద్దలు!
ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తే జీవి ఏది అంటే.. ఠక్కున వచ్చే సమాధానం చిరుత. మరి మనుషుల్లో? జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ పేరు ముందుగా గుర్తొస్తుంది. వేగానికి పర్యాయపదంగా మారిన బోల్ట్.. ఒక్కసారి పరుగు మొదలుపెడితే ప్రత్యర్థులకు అందనంత దూరంలో దూసుకెళ్లేవాడు. అలాంటి పరుగుల రారాజు నమోదు చేసిన గరిష్ఠ వేగం రికార్డు బద్ధలైంది!!.ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. మనిషి సాధించలేనిది.. యంత్రం చేసి చూపించింది. చైనాకు చెందిన ‘సూపర్‌మ్యాన్’ హ్యూమనాయిడ్ రోబో బోల్ట్ గరిష్ఠ వేగాన్ని దాటి టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ యూనిట్రీ రూపొందించిన రోబో.. సెకనుకు 12.66 మీటర్ల వేగంతో పరుగెత్తినట్లు సంస్థ వెల్లడించింది. అంటే గంటకు దాదాపు 45.6 కిలోమీటర్ల వేగం అన్నమాట. 2009లో బెర్లిన్‌లో జరిగిన 100 మీటర్ల పరుగులో ఉసేన్ బోల్ట్ నమోదు చేసిన గరిష్ఠ వేగం సెకనుకు 12.42 మీటర్లు. దీంతో వేగం విషయంలో బోల్ట్‌ను రోబో అధిగమించినట్లయింది.Chinese humanoid robot named “Superman”, made by Unitree Robotics, surpassed Usain Bolt’s world record (12.42 meters/second) by running at 12.66 m/s (roughly 28.3 miles/h) pic.twitter.com/xobXzUPDI5— Massimo (@Rainmaker1973) August 18, 2026ఉసేన్ బోల్ట్ 2009లో బెర్లిన్‌లో జరిగిన 100 మీటర్ల రేసును 9.58 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఆ పరుగులో ఆయన గరిష్ఠంగా సెకనుకు 12.42 మీటర్ల వేగాన్ని అందుకున్నారు. ఇప్పుడు యూనిట్రీ విడుదల చేసిన వీడియోలో ‘సూపర్‌మ్యాన్’ సెకనుకు 12.66 మీటర్ల వేగంతో దూసుకెళ్లడం కనిపించింది. దీంతో బోల్ట్ గరిష్ఠ వేగం కంటే రోబో వేగం స్వల్పంగా ఎక్కువగా నమోదైంది. పరుగుల తర్వాత అది దారి తప్పి కింద పడిపోవడం గమనార్హం.నిలబడే రెండు మీటర్లు జంప్!పరుగులోనే కాదు.. జంప్‌లోనూ ‘సూపర్‌మ్యాన్’ తన సామర్థ్యాన్ని చాటింది. ఎలాంటి రన్అప్ లేకుండా నిలబడి ఉన్న చోటు నుంచే సుమారు రెండు మీటర్ల ఎత్తుకు ఎగరగలదని యూనిట్రీ తెలిపింది. ఈ రోబో కాళ్ల పొడవు సుమారు 0.85 మీటర్లు. కేవలం మూడు నెలలకు పైగా వ్యవధిలోనే దీన్ని అభివృద్ధి చేసినట్లు సంస్థ వెల్లడించింది. భవిష్యత్తులో దీని వేగం, సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశం ఉందని తెలిపింది.వైరల్‌గా మారిన వీడియోయూనిట్రీ ఆగస్టు 17న ‘సూపర్‌మ్యాన్’ సామర్థ్యాలను చూపిస్తూ వీడియోను విడుదల చేసింది. వేగంగా పరుగెత్తడం, నిలబడి రెండు మీటర్ల వరకు ఎగరడం వంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మనిషి వేగానికి ప్రతీకగా నిలిచిన బోల్ట్ గరిష్ఠ వేగాన్ని రోబో దాటిందన్న విషయం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది.18 వేల రోబోలు తయారు చేసిన యూనిట్రీచైనాలోని హాంగ్జౌ కేంద్రంగా పనిచేస్తున్న యూనిట్రీ.. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ రంగంలో వేగంగా ఎదుగుతున్న సంస్థల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే వివిధ మోడళ్లకు చెందిన సుమారు 18 వేల బైపెడల్ హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. మరోవైపు యూనిట్రీ షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్లోని STAR మార్కెట్లో లిస్టింగ్‌కు సిద్ధమవుతోంది. ఐపీఓలో భాగంగా సుమారు 6.1 బిలియన్ యువాన్లు (దాదాపు 905 మిలియన్ డాలర్లు) సమీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘సూపర్‌మ్యాన్’ ప్రదర్శన సంస్థ సాంకేతిక సామర్థ్యాలపై మరింత ఆసక్తిని పెంచింది. -
రాయదుర్గం - కళ్యాణదుర్గం రైలుమార్గం తనిఖీ
హాజరైన సీఆర్ఏ, డీఆర్ఎం నేడు రైలు స్పీడ్ రన్ రాయదుర్గం టౌన్ : రాయదుర్గం నుంచి టుంకూరుకు నూతన రైలుమార్గంలో భాగంగా కళ్యాణదుర్గం వరకు పూర్తయిన మార్గాన్ని సౌత్ వెస్ట్రన్ రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే సేఫ్టీ అధికారులు గురువారం లాంఛనంగా తనిఖీ చేశారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ మనోహరన్, హుబ్లి డివిజన్ రైల్వే మేనేజర్ ఏకే జైన్, సీఆర్ఓ అశోక్‌గుప్తతోపాటు ఇతర ముఖ్య రైల్వే అధికారులు హాజరయ్యారు. వీరంతా ప్రత్యేక రైలులో బెంగళూరు నుంచి ఉదయం 7 గంటలకు రాయదుర్గం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. తొలుత రైలుమార్గం వివరాలు, ఇతరత్రా టెక్నికల్ వివరాలను సేకరించారు. అనంతరం కొత్త రైలుమార్గానికి పూజలు నిర్వహించి ఐదు ట్రాలీల్లో తనిఖీకి వెళ్లారు. అంతకుముందు డీఆర్ఎం ఏకే జైన్ మాట్లాడుతూ రాయదుర్గం నుంచి టుంకూరు రైలుమార్గంలో (205 కిలోమీటర్ల దూరం) ఇప్పటిదాకా 40 కిలోమీటర్ల పరిధిలోని కళ్యాణదుర్గం వరకు రైలుమార్గం పూర్తయిందన్నారు. గురు, శుక్రరాల్లో ఇక్కడే బస చేసి భద్రతా ప్రమాణాలు, ఇతర నాణ్యత విషయాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు చెప్పారు. మొదటిరోజు వేదావతి బ్రిడ్జి దాకా వెళ్లి పరిశీలిస్తామని, శుక్రవారం తనిఖీ పూర్తి చేసి రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం, తిరిగి కళ్యాణదుర్గం నుంచి రాయదుర్గం వరకు రైలు స్పీడ్ ట్రైల్ రన్ నిర్వహిస్తామని తెలిపారు. తనిఖీ నివేదికను రైల్వే ఉన్నతాధికారులకు సమర్పిస్తామన్నారు. త్వరలో ప్రయాణీకుల అవసరాన్ని బట్టి బళ్లారి లేదా గుంతకల్లు నుంచి రాయదుర్గం మీదుగా కళ్యాణదుర్గం వరకు ఒక ప్యాసింజర్ రైలు ప్రారంభించే అవకాశం ఉందన్నారు. కాగా, 1982లో శంకుస్థాపన చేసిన రాయదుర్గం-టుంకూరు రైలుమార్గానికి ప్రతియేటా బడ్జెట్ కేటాయింపులు నామమాత్రంగా ఉండటంతో రైలుమార్గం పూర్తి చేయడంలో జాప్యం జరుగుతూ వస్తోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత కేవలం 40 కిలోమీటర్ల మేర అంటే రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం వరకు పూర్తిస్థాయిలో రైలుమార్గం అందుబాటులోకి వచ్చింది. ఏది ఏమైనా ఇరురాష్ట్ర ప్రభుత్వాలు రైలుమార్గం పూర్తి చేసేందుకు పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేస్తే టుంకూరు రైలుమార్గం పూర్తవుతుంది.


