అలాంటివి జరగకముందే మేల్కొందాం! | quick police alert is beter to stop murders | Sakshi
Sakshi News home page

అలాంటివి జరగకముందే మేల్కొందాం!

Sep 19 2016 6:41 AM | Updated on Sep 4 2018 5:24 PM

అలాంటివి జరగకముందే మేల్కొందాం! - Sakshi

అలాంటివి జరగకముందే మేల్కొందాం!

ఏ సమస్యనైనా ముందుగానే గుర్తించి, ఆదిలోనే తుంచేయగలిగితే పరిస్థితులు తీవ్రంగా మారేవి కాదు.

సాక్షి, సిటీబ్యూరో:

నగరంలోని ఓ ప్రాంతంలో నిత్యం ఈవ్‌టీజింగ్‌ జరుగుతోంది. ఓ దశలో ఇది శృతిమించి ప్రేమోన్మాదిగా మారిన పోకిరీ విద్యార్థిని/యువతిపై దాడికి బరితెగించాడు. దీంతో ఆ ప్రాంతం మొత్తం ఉలిక్కిపడింది. సిటీలోని ఓ బస్తీలో ఎక్కడ చూసినా బహిరంగ ప్రదేశంలో మద్యం తాగే వాళ్ళు కనిపిస్తుంటారు. ఇద్దరు తాగుబోతుల మధ్య జరిగిన ఘర్షణ పట్టపగలు, నడిరోడ్డుపై హత్యకు దారితీసింది.

ఓ కాలనీలోని ఓ ఇంట్లో పసిపిల్లల్ని పనిలో పెట్టుకుని చిత్రహింసలకు గురి చేసేవారు. కొన్నాళ్ళు ఈ బాధల్ని ఓర్చుకున్న ఆ బాలిక పట్టుకోలేని స్థితిలో బయటపడలేననే భావనతో ఆత్మహత్య చేసుకుంది.

ఈ మూడింటిలో ఏ సమస్యనైనా ముందుగానే గుర్తించి, ఆదిలోనే తుంచేయగలిగితే పరిస్థితులు తీవ్రంగా మారేవి కాదు. ఇదే విషయాన్ని గుర్తించిన నగర పోలీసు విభాగం కమ్యూనిటీ పోలీసింగ్‌ విధానంలో సమగ్ర మార్పులు తీసుకువస్తోంది. స్థానికంగా ఉండే ఇలాంటి సమస్యల్ని గుర్తించే పనిని క్షేత్రస్థాయి అధికారులకు, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యతల్ని అధికారులకు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ సరికొత్త విధానాలను త్వరలోనే నగర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేయడానికి కమిషనర్‌ కార్యాలయం కసరత్తు చేస్తోంది.

 ప్రస్తుతం జరుగుతోందిలా...
నగరంలో ఇప్పుడూ కమ్యూనిటీ పోలీసింగ్‌ విధానం అమలవుతోంది. ఈ బాధ్యతల్ని క్షేత్రస్థాయిలో గస్తీ విధులు నిర్వర్తించే పెట్రోలింగ్‌ వాహనాలతో పాటు బ్లూకోల్డ్స్‌ సిబ్బందికి అప్పగించారు. వీరు తమ పరిధుల్లోని ప్రాంతాల్లో నిత్యం తిరుగుతూ కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్‌మెంట్‌ సంక్షేమ సంఘాలు, వర్తక/వాణిజ్య సంఘాలతో పాటు ఇతర కమ్యూనిటీలను కలుస్తుంటారు.

పోలీసు విభాగం చేపడుతున్న కార్యక్రమాలను వారికి వివరించడంతో పాటు ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలు, కరపత్రాలను వారికి పంపిణీ చేస్తారు. క్రమం తప్పకుండా అనునిత్యం వారిని కలుస్తున్నప్పటికీ ఈ కమ్యూనిటీ పోలీసింగ్‌ విధానంలో లోపాలు ఉన్నట్లు కమిషనరేట్‌ కార్యాలయం గుర్తించింది. దీంతో ఫలితాలతో కూడిన కమ్యూనిటీ పోలీసింగ్‌ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.

 ఇకపై జరిగేది ఇలా...
ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బందితో పాటు గస్తీ వాహనాలకూ ట్యాబ్స్‌ అందించారు. ఇవి నిత్యం ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీ కలిగి ఉండటంతో పాటు పోలీసు విభాగానికి సంబంధించిన ప్రత్యేక యాప్స్‌ నిక్షిప్తమై ఉంటాయి. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఆయా సంఘాలతో పాటు స్థానికుల్ని కలిసినప్పుడు వారి నుంచి ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలు, న్యూసెన్స్‌ అంశాలతో పాటు ఇతర ఇబ్బందుల్ని తెలుసుకుంటారు.

వాటిని ట్యాబ్‌్సలో ఉండే పోలీసు యాప్స్‌లోకి ఫీడ్‌ చేస్తారు. ఏ ప్రాంతంలోనైనా ఓ ఇబ్బంది/సమస్యపై ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తి గోప్యంగా ఉంచేందుకు ఎక్కడా ఎంట్రీ చేయరు. ఈ విధంగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న సమస్యలూ పోలీసు విభాగానికి సంబంధించిన సెంట్రలైజ్డ్‌ డేటాబేస్‌లోకి వచ్చి చేరతాయి.

 పరిష్కారాలూ ‘చెప్పాల్సిందే’...
ఈ డేటాబేస్‌ కారణంగా ఉన్నతాధికారులకు తమ తమ పరిధుల్లోని ప్రాంతాల్లో ఏ సమస్యలు, ఎక్కడ ఎక్కువగా ఉంటున్నాయి? అనేది తెలుస్తుంది. దీంతో పాటు ఆయా ఏరియాలకు చెందిన స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ (ఇన్‌స్పెక్టర్‌), ఏసీపీలు తమ పరిధుల్లోని సమస్యలు డేటాబేస్‌ ద్వారా గుర్తించడంతో పాటు వారం రోజుల్లో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

సదరు సమస్యను తీర్చడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఉన్నతాధికారుల నుంచి అవసరమైన సహాయసహకారాలు ఏంటి? అనే అంశాలనూ యాప్‌లో పొందుపరచాల్సి ఉంటుంది. సదరు సమస్య పోలీసు విభాగం పరిష్కరించేది కాకుంటే సంబంధిత శాఖ అధికారుల దృష్టికి దాన్ని తీసుకువెళ్ళడంతో పాటు అది తీరేలా చూడాల్సిందే. వీటిపైనా నిత్యం ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

నగరంలో ఉన్న ‘షీ–టీమ్‌’, టాస్క్‌ఫోర్స్, సీసీఎస్‌ తదితర ప్రత్యేక విభాగాలు సైతం నిత్యం సెంట్రలైజ్డ్‌ డేటాబేస్‌లో ఉన్న వివరాలు ఆధారంగా ఆయా ప్రాంతాల్లో అవసరమైన ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంటారు. త్వరలో నగర వ్యాప్తంగా అమలులోకి రానున్న ఈ విధానంపై ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ప్రజల్లో ఒకరిగా ఉండి, వారి సమస్యల్ని ఎప్పటికప్పుడు గుర్తించడంతో పాటు గుర్తించడంతో పాటు వారి ద్వారానే తెలుసుకోవడం, ఎప్పటికప్పుడు పరిష్కారానికి కృషి చేయడమే కమ్యూనిటీ పోలీసింగ్‌. దీన్ని నగరంలో పక్కాగా అమలు చేయడానికి నిర్ణయించాం’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement