ఏం సాధించారని ఊరేగింపులు? | Processions achieve for what?:congress | Sakshi
Sakshi News home page

ఏం సాధించారని ఊరేగింపులు?

Mar 9 2016 1:31 AM | Updated on Mar 18 2019 8:51 PM

ఏం సాధించారని ఊరేగింపులు? - Sakshi

ఏం సాధించారని ఊరేగింపులు?

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. మహా ఒప్పందం పేరుతో ఏం సాధిం చారని ఆర్భాటంగా ఊరేగింపులు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టినందుకా: కాంగ్రెస్

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. మహా ఒప్పందం పేరుతో ఏం సాధిం చారని ఆర్భాటంగా ఊరేగింపులు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. మహా ఒప్పందం పేరిట తెలంగాణ ప్రయోజనాలను శాశ్వతంగా మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే మేడిగడ్డపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై అసెంబ్లీలో నిలదీయడంతోపాటు మేధావులు, విద్యావేత్తలు, ఉద్యమకారులతో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

కరీంనగర్‌లో మంగళవారం సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. ‘‘తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాణహిత ప్రాజెక్టు చేపట్టాలని 2012 మే 5న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మహారాష్ట్ర సర్కార్‌తో సూత్రప్రాయ ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల మహారాష్ట్రలో 1,800 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతుంద ని అంచనా వేశారు.

ఒకే ఒక్క ఎత్తిపోతల పథకంతో 40 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా నీరందించేలా డిజైన్ చేసిన ఆ ప్రాజెక్టును కాదని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం వద్ద రిజర్వాయర్లు నిర్మించడంలో ఆంతర్యమేమిటి? పైగా తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తును కాదని మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించాల్సిన అవసరమేమిటి? ప్రాజెక్టు వ్యయాన్ని రూ.15 వేల కోట్ల మేరకు పెంచడానికా? రెండు ఎత్తిపోతల ప్రాజెక్టులకు అవసరమయ్యే వెయ్యి మెగావాట్ల కరెంటు భారాన్ని ప్రజలపై మోపడానికా? అసలు ఏం సాధించారని ఈ ఊరేగింపులు?’’ అని మండిపడ్డారు. తుమ్మిడిహెట్టి వద్ద 1,800 ఎకరాల సాగుయోగ్యం కాని భూములు మాత్రమే ముంపు గురువుతున్నా కాదని, 3,400 ఎకరాల సాగుభూమి ముంపునకు గురయ్యే మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement