తిరుపతిలో నేడు కాంగ్రెస్‌ ప్రజా బ్యాలెట్‌ | Sakshi
Sakshi News home page

తిరుపతిలో నేడు కాంగ్రెస్‌ ప్రజా బ్యాలెట్‌

Published Tue, Sep 27 2016 11:37 PM

కాంగ్రెస్‌ ప్రజా బ్యాలెట్‌ పత్రం - Sakshi

– ప్రత్యేక హోదా, బాబుహామీల అమలుపై ఓటింగ్‌
– మధ్యాహ్నం నుంచి పీసీసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
– హాజరవుతున్న రఘువీరా, కేవీపీ, సీ రామచంద్రయ్య
 
సాక్షి ప్రతినిధి, తిరుపతి : 
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకత, చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల అమలుపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా బ్యాలెట్‌కు శ్రీకారం చుడుతోంది. పీసీసీ చీఫ్‌ ఎన్, రఘువీరారెడ్డి బుధవారం ఉదయం తిరుపతిలో దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 8 గంటలకు అలిపిరి శ్రీవారి పాదాల దగ్గర కొబ్బరికాయలు కొట్టి మున్సిపల్‌ కార్యాలయం వరకూ పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా ప్రజా బ్యాలెట్‌ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటలకు మున్సిపల్‌ కార్యాలయం దగ్గర జరిగే బహిరంగ సభలో పార్టీ సీనియర్లు కేవీపీ రామచంద్రరావు, సీ రామచంద్రయ్య, సాకే శైలజానాథ్, వివిధ జిల్లాల పార్టీ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్‌నాయకులు పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధనలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరించడమే కాకుండా, ఎన్నికల సందర్భంగా టీడీపీ ప్రజలకిచ్చిన 600 హామీలను ఎలా విస్మరించిందో వివరించనున్నారు. జిల్లా పార్టీ నేతలు కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. 
3 గంటలకు పీసీసీ కార్యవర్గ సమావేశం
కాగా మధ్యాహ్నం 3 గంటలకు భీమాస్‌ హోటల్‌లో పీసీసీ కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఇక్కడే పార్టీ కార్యనిర్వాహక కమిటీ సభ్యులతోనూ ప్రజాబ్యాలెట్‌ నిర్వహణపై చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాబ్యాలెట్‌ నిర్వహణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సమావేశంలో ఖరారు చేస్తామని పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి తెలిపారు. 
 
 
 

Advertisement
Advertisement