చెట్టా‘పట్టా’ల్‌ | officers support to tdp leaders | Sakshi
Sakshi News home page

చెట్టా‘పట్టా’ల్‌

Sep 2 2017 10:40 PM | Updated on Aug 10 2018 9:42 PM

చెట్టా‘పట్టా’ల్‌ - Sakshi

చెట్టా‘పట్టా’ల్‌

ఆర్టీసీ బస్టాండ్‌కు కూతవేటు దూరంలోని రాజహంస టవర్స్‌ ఎదుటనున్న వంక పొరంబోకు(సర్వే నెంబర్‌ 94లోని 2.54 ఎకరాలు) స్థలంలో నిర్మిస్తున్న ఇల్లు.

టీడీపీ నేతలతో రెవెన్యూ అధికారుల మిలాఖత్‌
- వంక పోరంబోకు భూములకు పట్టాలు
- చేతులు మారుతున్న లక్షలాది రూపాయలు
- నకిలీ పట్టాలతో పక్కా మోసం
- మధ్య తరగతి కుటుంబాల జీవితాలతో చెలగాటం
- ఏళ్లు గడుస్తున్నా చర్యలకు అధికారుల వెనుకంజ


- ఆర్టీసీ బస్టాండ్‌కు కూతవేటు దూరంలోని రాజహంస టవర్స్‌ ఎదుటనున్న వంక పొరంబోకు(సర్వే నెంబర్‌ 94లోని 2.54 ఎకరాలు) స్థలంలో నిర్మిస్తున్న ఇల్లు. ఇక్కడ సెంటు స్థలం ధర రూ.6లక్షల నుంచి రూ.7లక్షలు పలుకుతోంది. కొందరు అధికార పార్టీ నేతలు ఈ స్థలాన్ని కబ్జా చేశారు. రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించారు. వీటిని ఒక్కో పట్టా రూ.2లక్షల నుంచి రూ.4లక్షల చొప్పున విక్రయించారు. ప్రస్తుతం 60 నుంచి 70 పక్కా ఇళ్లు నిర్మించారు.

- రాచానపల్లి వంక పోరంబోకు(సర్వే నెంబర్‌ 4-2లో)లోని 4.80 ఎకరాలకు రెవెన్యూ అధికారులు 1996లో మురళీమోహన్‌ అనే వ్యక్తి.. దీని పక్కనే ఉన్న 2-2బీ సర్వే నెంబర్‌లో 5 ఎకరాల స్థలాన్ని మురళీమోహన్‌ తండ్రి ఆర్‌.సంజీవులుకు పట్టాలను కట్టబెట్టారు. ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించినా ఫలితం లేకపోయింది. తాజాగా ఈ వ్యవహారాన్ని పక్కదోవ పట్టిస్తూ ఇక్కడ 110 ప్లాట్లు వేసి విక్రయానికి పెట్టడం గమనార్హం.

అనంతపురం రూరల్‌: మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను అధికార పార్టీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారుల అండతో ప్రభుత్వ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెగబడ్డారు. పోరంబోకు భూముల్లో పాగా వేసి నకిలీ పట్టాలు సృష్టిస్తున్నారు. ఆ తర్వాత ప్లాట్లు వేసి ఎంచక్కా అమ్మేస్తున్నారు. ఈ తంతు ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కాదు.. జిల్లా కేంద్రం అనంతపురంలోనే సాగుతుండటం గమనార్హం. ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు నయానో భయానో అధికారులను దారిలోకి తెచ్చుకుని దందా సాగిస్తున్నారు. పాపం అధికారులు.. తమకెందుకు వచ్చిన గొడవ అనుకుని మౌనం దాలుస్తున్నారు. ఇదే సమయంలో అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి తమ  పని కానిచ్చేస్తున్నారు. రాజహంస టవర్స్‌ ఎదుటనున్న ప్రభుత్వ స్థలం విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.6లక్షల పైమాటే.

అయితే ఇక్కడ సెంటు రూ.3లక్షలు చొప్పున ఏకంగా2.58 ఎకరాల వంక పోరంబోకు భూమికి ఎసరు పెట్టారు. ఈ స్థలాన్ని ఎక్కువ శాతం ప్రభుత్వ ఉద్యోగులే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అత్యంత విలువైన స్థలం కారుచవకగా వస్తుండటంతో కొందరు అధికారులు అధికార పార్టీ నేతలు ఉచ్చులో చిక్కుకున్నట్లు సమాచారం. 1997లో రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేసినట్లు నకిలీలు తయారు చేసి వ్యాపారం చేస్తున్నారు. వాస్తవానికి రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు ఆ స్థలానికి సంబంధించి ఎలాంటి పట్టాలు జారీ చేయకపోవడం గమనార్హం.

పట్టించుకోని ఉన్నతాధికారులు
ప్రభుత్వ భూములను కబ్జా చేసి కళ్లెదుటే ప్లాట్లు వేస్తున్నా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడని పరిస్థితి. ఒకటి కాదు.. రెండు కాదు.. నగరం చుట్టుపక్కల ఇలాంటి అనుమతి లేని వెంచర్లు వెలుస్తున్నా మౌనం దాల్చడం విమర్శలకు తావిస్తోంది. వందల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నా జిల్లా ఉన్నతాధికారులు కూడా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికైనా ఇంటి దొంగల భరతం పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న మధ్య తరగతి ప్రజలు విజయనగర్‌ కాలనీ తరహాలో రోడ్డున పడే ప్రమాదం లేకపోలేదు.

క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవు. నకిలీ పట్టాల వ్యవహారంపై లోతుగా విచారణ చేపట్టి బాధ్యులపై క్రిమిన్‌ కేసులు నమోదు చేస్తాం. దీని వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టబోం. వంక పోరంబోకు స్థలాల్లో నిర్మించిన ఇళ్లను తొలగించి హద్దులను ఏర్పాటు చేస్తాం.
- మలోల, ఆర్డీఓ అనంతపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement