చంద్రన్న బీమా చేయించారు ఆన్‌లైన్‌ చేయడం మరిచారు | Municipal Officers forgot Chandranna Insurance Online | Sakshi
Sakshi News home page

చంద్రన్న బీమా చేయించారు ఆన్‌లైన్‌ చేయడం మరిచారు

Sep 8 2017 12:25 PM | Updated on Oct 16 2018 6:27 PM

గత ఏడాది మున్సిపల్‌ సిబ్బంది  ఇచ్చిన చంద్రన్న బీమా రసీదు, మృతిచెందిన గురవిరెడ్డి (ఫైల్‌ ఫొటో) - Sakshi

గత ఏడాది మున్సిపల్‌ సిబ్బంది ఇచ్చిన చంద్రన్న బీమా రసీదు, మృతిచెందిన గురవిరెడ్డి (ఫైల్‌ ఫొటో)

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న బీమా లబ్ధిదారులను ఆన్‌లైన్‌ చేయడంలో మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

మృతిచెందిన కుటుంబానికి బీమా డబ్బు కోసం చైర్మన్‌ దృష్టికి
వందలాది మంది లబ్ధిదారులది ఇదే పరిస్థితి  


ప్రొద్దుటూరు టౌన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న బీమా లబ్ధిదారులను ఆన్‌లైన్‌ చేయడంలో మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మృతుల కుటుంబాలకు బీమా సొమ్ము వచ్చే పరిస్థితులు కానరావడం లేదు. పట్టణంలోని స్వయంసేవక్‌ రోడ్డులో నివాసం ఉంటున్న భోగాల గురివిరెడ్డి, ఆయన కుటుంబసభ్యులు 2016 ఆగస్టు 21న చంద్రన్న బీమా చేయించుకున్నారు. ఇందుకు ఇంటి వద్దకు వచ్చిన సిబ్బంది రూ.15 కట్టించుకొని రసీదు నంబర్‌ 30374ను ఇచ్చారు. అప్పటి నుంచి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచలేదు.

సోమవారం గురివిరెడ్డి అనారోగ్యంతో మృతి
గురివిరెడ్డి అనారోగ్యంతో సోమవారం మృతిచెందారు. చంద్రన్న బీమా కట్టిన రసీదును తీసుకొని మృతిని కుటుంబసభ్యులు మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి ఆరా తీశారు. తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బీమా సొమ్ము ఇప్పించాలని కోరారు. రసీదు నంబర్, వివరాలను ఆన్‌లైన్‌లో చూసిన సిబ్బంది వివరాలను పొందుపరచలేదని తేల్చారు. ఏడాది దాటినా ఇంత వరకు బీమా కట్టించుకున్న వారి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచక పోవడం చూస్తుంటే మున్సిపల్‌ అధికారుల పనితీరు అర్థం అవుతోంది.

ఆన్‌లైన్‌లో లేని వందలమంది వివరాలు
ఈ విధంగా వందలాది మంది వివరాలను మున్సిపల్‌ అధికారులు ఆన్‌లైన్‌లో ఎక్కించనట్లు తెలుస్తోంది. చంద్రన్న బీమా రూ.15 కట్టించుకొని వివరాలను ఆన్‌లైన్‌లో ఎక్కించడానికి మొదట రెవెన్యూ సిబ్బందిని నియమించింది. వీరి నుంచి మెప్మా ఆర్పీలను, సీఓలకు ఇచ్చారు. రెవెన్యూ సిబ్బంది వందలాది మంది వివరాలను ఆన్‌లైన్‌లో ఎక్కించకుండా కేవలం డబ్బు కట్టించుకొని రసీదులు ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయంపై మున్సిపల్‌ కమిషనర్‌ విచారణ జరిపితే ఆన్‌లైన్‌లో లేని లబ్ధిదారుల వివరాలు బయటపడే అవకాశం ఉంది. ప్రభుత్వం సాధారణంగా మృతి చెందిన వారికి చంద్రన్న బీమా రూ.30వేల నుంచి రూ. 2లక్షలకు పెంచినట్లు ప్రకటించింది.

మున్సిపల్‌ చైర్మన్, పీడీ దృష్టికి సమస్య
జరిగిన విషయంపై బాధిత కుటుంబ సభ్యులు సిబ్బంది నిర్లక్ష్యాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ ఆసం రఘురామిరెడ్డి, మెప్మా పీడీ రామ్మోహన్‌రెడ్డిల దృష్టికి తీసుకెళ్లారు. చైర్మన్‌ కచ్చితంగా బాధిత కుటుంబసభ్యులకు బీమా సొమ్ము వచ్చేలా చర్యలు తీసుకోవాలని పీడీకి చెప్పారు. ఏది ఏమైనా ఆన్‌లైన్‌లో లబ్ధిదారుల వివరాలు ఎక్కించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement