పూజలు, పసుపు రంగు డ్రెస్సులు, విద్యా దేవత అయిన సరస్వతి దేవిని ఆరాధించడం, పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించడం.. వసంతి పంచమి అనగానే మనకు గుర్తుకొచ్చేవి ఇవే. అయితే డిజిటల్ యుగంలో ఈ పండుగకు కొత్త అర్థాలు చెబుతున్నారు. సరికొత్త కోణాలు చేరుస్తున్నారు.
ఇప్పటి తరానికి వసంతి పంచమి కేవలం పుస్తకాలు, పాఠశాలలు, ఆలయాలకే పరిమితం కాదు. డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఆన్‌లైన్ క్లాసులు, ఇ-లైబ్రరీలు కూడా సరస్వతీ ఆరాధనలో భాగమవుతున్నాయి. విద్యార్థులు పుస్తకాలకు పూజలు చేయడమే కాకుండా.. తమ ల్యాప్‌టాప్, టాబ్లెట్, మొబైల్ ఫోన్లను కూడా పూజలో ఉంచుతున్నారు. జ్ఞానం ఇప్పుడు పుస్తకాలకే పరిమితం కాకుండా, డిజిటల్ రూపంలో విస్తరించిందనడానికి ఇంతకంటే ఏం కావాలి?.
వసంతి పంచమి రోజున కొత్త విద్య ప్రారంభిస్తారు. పిల్లలతో పలకా బలం పట్టి దిద్దించడం చూసేదే. అయితే కొందరు తల్లిదండ్రులు పిల్లలకు ఆన్‌లైన్ కోర్సులులో నమోదు చేయడం, కోడింగ్ క్లాసులు మొదలుపెట్టడం, లేదంటే డిజిటల్ ఆర్ట్ నేర్పించడం ద్వారా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. సరస్వతీ దేవి జ్ఞానానికి ప్రతీక అయితే, డిజిటల్ సరస్వతీ అనేది సాంకేతికత ద్వారా జ్ఞానం అందించే కొత్త రూపం.
ఇటు సోషల్ మీడియా కూడా ఈ పండుగలో కీలక పాత్ర పోషిస్తోంది. పసుపు రంగు దుస్తులు ధరించి ఫోటోలు పోస్ట్ చేయడం, సరస్వతీ దేవి డిజిటల్ ఆర్ట్ షేర్ చేయడం, వర్చువల్ పూజల్లో పాల్గొనడం.. కొత్త తరానికి వసంతి పంచమి అనుభవాన్ని మరింత విస్తరింపజేస్తున్నాయి.
మొత్తం మీద, వసంతి పంచమి అనేది సంప్రదాయం ఫ్లస్ సాంకేతికత కలయికగా మారింది. పుస్తకాలు, పాఠశాలలు, ఆలయాలు ఎంత ముఖ్యమో.. అదే స్థాయిలో డిజిటల్ పరికరాలు, ఆన్‌లైన్ లెర్నింగ్ కూడా ఈ పండుగలో భాగమవుతున్నాయి. ఇది మన సంస్కృతి కాలానుగుణంగా ఎలా మారుతుందో చూపించే ఒక అందమైన ఉదాహరణ.


