– బిడ్డకు బలమైన ఆహారం తల్లిపాల్లోనే..
– తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం
మహబూబ్‌నగర్ క్రైం : పేగు తెంచుకొని పుట్టిన బిడ్డకు అమ్మపాలు అమృతంలా పనిచేస్తుంది. అమ్మ పాలతో ఆకలి తీర్చుకుంటేనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం. రోగనిరోదకశక్తి పెంచడంతోపాటు భవిష్యత్‌లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. సోమవారం నుంచి తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలు ఈ కార్యక్రమం నిర్వహించారు. వారం రోజులపాటు ప్రజలకు అమ్మపాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు.
వారోత్సవాల లక్ష్యం..
మాతృ దోహద చట్టం–1961 ప్రకారం ఏటా తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మహిళా ఉద్యోగులు, కార్మికులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు అనువైన పరిస్థితులు కరువడంతో 1993లో తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి సంస్థలో మాతృదోహద పరిస్థితులు తీసుకురావాలనే లక్ష్యం నిర్దేశించారు. గతేడాది 2015 వారోత్సవాల్లో కూడా ఇదే ప్రధాన నినాదంగా పెట్టుకున్నారు.
ఇవీ నిబంధనలు..
– ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల్లో పని చేసే మహిళలు వారి బిడ్డలకు పాలిచ్చేందుకు అనువైన పరిస్థితులను, సదుపాయాలను కల్పించాలి.
– బిడ్డను వెంట తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించాలి.
– దినచర్యలో రెండుగంటల పాటు బిడ్డకు పాలిచ్చే అవకాశం కల్పిస్తూ విరామం ఇవ్వాలి.
– వేతనంతో కూడిన ఆరునెలల ప్రసూతి సెలవు అమలు చేయాలి.
అమ్మపాలతో లాభాలు..
– పుట్టిన బిడ్డకు అరగంటలోపు ముర్రుపాలు తాగిస్తే రోగనిరోదక శక్తి పెరుగుతుంది. – బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి తల్లిపాలు సహకరిస్తాయి.
– బిడ్డకు సరిపడు ప్రోటీన్లు, కాల్షియం నిల్వలు తల్లిపాలలో మెండుగా ఉంటాయి.
– అంటు వ్యాధుల నుంచి రక్షిస్తూ మలబద్దకం సమస్య తగ్గిస్తుంది.
– బాల్యంలో యవ్వనంలో ఉబకాయం వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది.
– పుట్టిన బిడ్డకు చనుపాలు ఇవ్వటంతో రక్తస్రావ ప్రమాదం తగ్గి తల్లి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.
– తల్లిపాలు జీర్ణమవడం చాలా తేలికగా ఉంటుంది.
– బిడ్డకు వచ్చే వ్యాధులతో తల్లిపాలు పోరాడే శక్తినిస్తుంది
– ఎముకల పెరుగుదలకు శరీర పెరుగుదలకు సహాయపడుతుంది.
– కంటిచూపు సంబంధించిన లోపాలు రాకుండా నియంత్రిస్తాయి.
– బిడ్డ మానసికంగా, శారీరకంగా ఎదగడానికి తోడ్పడతాయి
– తల్లికి రొమ్ము క్యాన్సర్ రాకుండా సహాయపడుతుంది.
– తల్లికి బిడ్డకు మధ్య అనుబంధం పెరుగుతుంది
– వెన్నముకలోని శక్తిని పెంచుతుంది
పాలివ్వడం తల్లి బాధ్యత.. తాగడం బిడ్డ హక్కు
ప్రసవం అనంతరం బిడ్డకు పాలివ్వడం తల్లి బాధ్యత. అలాగే తల్లిపాలు తాగడం బిడ్డ హక్కు. తల్లిపాలల్లో న్యూట్రీషన్స్ అధికంగా ఉండటంతో ప్రసవం అయిన ఆరు నెలల వరకు క్రమం తప్పకుండా పాలివ్వాలి.
– డాక్టర్ లక్ష్మిపద్మప్రియ, గైనకాలజిస్టు