చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో 12వ అంతస్తు కిటికీ గ్రిల్‌కు చిక్కుకుని బయట వేలాడుతున్న మూడేళ్ల బాలికను స్థానికులు, భద్రతా సిబ్బంది సమయస్ఫూర్తితో కాపాడారు. బాలిక కింద పడిపోకుండా ఆమె శరీరానికి కింద స్టూల్‌ను అడ్డుగా పెట్టి అగ్నిమాపక సిబ్బంది వచ్చే వరకు ఆసరాగా నిలిచారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది బాలికను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
చైనాలోని జాంగ్‌పింగ్ నగరంలో అక్టోబర్ 17న ఉదయం 7.48 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కిటికీకి ఏర్పాటు చేసిన భద్రతా గ్రిల్ నుంచి బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె తల లోహపు కడ్డీల మధ్య ఇరుక్కుపోయింది. దీంతో బాలిక శరీరం కిటికీ బయట వేలాడుతూ ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది.
బాలిక తండ్రి పనికి వెళ్లగా, తల్లి ఆమె నిద్రపోతోందని భావించి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసేందుకు బయటకు వెళ్లింది. ఈ సమయంలో బాలిక కిటికీ వద్దకు వెళ్లినట్లు సమాచారం. బాలిక ప్రమాదకర స్థితిలో వేలాడుతుండటాన్ని గమనించిన ఓ స్థానికుడు వెంటనే అప్రమత్తమయ్యాడు. ఘటనకు సంబంధించిన చిత్రాలను నివాస సముదాయంలోని సామాజిక మాధ్యమాల బృందంలో పంచుకుని సాయం కోరాడు. దీంతో భద్రతా సిబ్బంది, భవన నిర్వహణ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు.
బాలిక ఉంటున్న ఇంటికి కింద అంతస్తులోని ఫ్లాట్‌లోకి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు వేర్వేరు కిటికీల నుంచి బయటకు వంగి, బాలిక శరీరానికి కింద స్టూల్‌ను పట్టుకున్నారు. దీంతో ఆమె పూర్తిగా గాల్లో వేలాడకుండా కొంత ఆసరా లభించింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చే వరకు వారు బాలికను కింద పడిపోకుండా కాపాడేందుకు ప్రయత్నించారు.
అనంతరం అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బాలిక ఇంటి తలుపును బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లారు. కిటికీ గ్రిల్‌కు చిక్కుకున్న బాలికను విడిపించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. బాలికకు ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనలో స్థానికులు, భద్రతా సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి బాలిక ప్రాణాలను కాపాడటంలో కీలకమైంది. ఎత్తైన భవనాల్లో చిన్నపిల్లలను ఒంటరిగా వదిలివేయకుండా చూడటం, కిటికీలు, బాల్కనీల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.
太惊险了😱爸爸去上班,妈妈早起去买菜,一岁多的孩子被挂16楼阳台。 后续被众人合力救下🙏 https://t.co/2cMDzwVuIc
— 小牛 (@Xiaoniu6161) October 17, 2026


