తోడికోడలు హత్య కేసులో జీవిత ఖైదు, జరిమానా


కర్నూలు(లీగల్‌) :  డబ్బు కోసం తోడు కోడలు యశోదమ్మ(47)ను హత్య చేసిన కేసులో ఓ మహిళకు జీవిత ఖైదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ కర్నూలు జిల్లా ఆరవ అదనపు కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దూపాడు గ్రామానికి చెందిన కె.యశోదమ్మ(47) పొదుపులక్ష్మి గ్రూపు సభ్యురాలిగా ఉండేది. గద్వాల మండలం మొల్ల చెరువు గ్రామానికి చెందిన తోడి కోడలు గ్రేసమ్మ అప్పుడప్పుడు యశోదమ్మ ఇంటికి వచ్చి ఉంటుండేది. యశోదమ్మ ఇతరులకు అప్పులు ఇస్తుండటం, అభరణాలతోపాటు కర్నూలులో ప్లాటు ఉన్నట్లు తెలుసుకుంది. 2014 డిసెంబర్‌ 28న ఇద్దరు పొదుపులక్ష్మి గ్రూపు సమావేశానికి వెళ్లి డబ్బు తెచ్చుకున్నారు. అదే రోజు అర్ధరాత్రి సమయంలో యశోదమ్మను గ్రేసమ్మ గొంతు నులిమి చంపేసింది. రెండు, మూడు రోజులు ఇంట్లో ఉండి 31వ తేదీన బంగారు ఆభరణాలు, డాక్యుమెంట్స్‌ తీసుకుని వెళ్లిపోయింది. ఇంట్లో శవం కుళ్లిన వాసన వస్తుండడంతో వరుసకు తమ్ముడైన జేమ్స్‌ వెళ్లి చూడగా విషయం బయటపడింది. అతని ఫిర్యాదు మేరకు ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం గ్రేసమ్మ మరో వ్యక్తి వేణుగోపాలాచారితో కలిసి హత్య చేసినట్లు ఇప్పుకుంది. దీంతో ఇద్దరిపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.  మొదటి నిందితురాలైన గ్రేసమ్మ అలియాస్‌ రాణిపై హత్యానేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి వి.వి.శేషుబాబు తీర్పు చెప్పారు. 2వ నిందితుడిపై సాక్ష్యాలు లేకపోవడంతో కేసు కొట్టివేశారు.  
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top