చెట్ల కిందనే పాఠాలు! | Sakshi
Sakshi News home page

చెట్ల కిందనే పాఠాలు!

Published Tue, Jun 27 2017 11:38 PM

చెట్ల కిందనే పాఠాలు!

► బిల్లులు రాక గదికి తాళాలు  వేసిన కాంట్రాక్టర్‌ !
► ఆరుబయట కూర్చుంటున్న విద్యార్థులు
► పట్టించుకోని  ఉన్నతాధికారులు
► ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు


ఇల్లందకుంట: ఉన్నతాధికారుల నిర్లక్ష్యం..విద్యార్థులకు శాపంగా మారింది. బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యంతో విసుగెత్తిన ఓ కాంట్రాక్టర్‌ అదనపు తరగతిగదులకు తాళం వేయడంతో విద్యార్థులకు చెట్లే దిక్కయ్యాయి. చేసేదేమిలేక ఉపాధ్యాయులు సైతం చెట్ల కిందనే పాఠాలు బోధిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసిన పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రూ.28.61లక్షలతో..
ఇల్లందకుంట మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం రెండేళ్ల క్రితం రూ.28.61లక్షల నిధులు మంజూరు చేసింది. పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌ సకాలంలో పూర్తి చేశాడు. ఈ విద్యాసంవత్సరం అదనపు తరగతి గదులకు మారేందుకు ఉపాధ్యాయులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అయితే తనకు బిల్లులు రాలేవంటూ కాంట్రాక్టర్‌ నూతన భవనాలకు తాళం వేసుకున్నారని ప్రధానోపాద్యాయుడు సాంబయ్య తెలిపారు. చేసేదేమి లేక చెట్ల కిందనే పాఠాలు బోధిస్తున్నట్లు చెప్పారు.

వెనుదిరుగుతున్న తల్లిదండ్రులు
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు వచ్చి ఇక్కడి విద్యార్థుల చెట్ల కింద కూర్చోవడాన్ని చూసి వెనుదిరుగుతున్నారు. అన్ని వసతులు ఉన్నప్పటికీ కాంట్రాక్టర్‌ తాళం వేయడం, ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యార్థుల సంఖ్య తగ్గే ప్రమాదం ఉందని విద్యార్థి సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.

అధికారులకు నివేదించాం
డబ్బులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్‌ నూతన భవనాలకు తాళం వేసుకున్నారు. ఈ విషయంతోపాటు విద్యార్థులు చెట్ల కింద కూర్చుంటున్న విషాయన్ని సైతం ఉన్నతాధికారులకు నివేదించాం. ప్రస్తుతం కూలిపోయిన తరగతిగదులలో కొందరు, మరికొందరు చెట్లకింద కూర్చుంటున్నారు. కాంట్రాక్టర్కు సైతం చాలాసార్లు ఫోన్‌ చేశాం. ఆయన స్పందించడం లేదు.                                      
 – సాంబయ్య, ప్రధానోపాధ్యాయుడు

Advertisement
 
Advertisement
 
Advertisement