కొత్త చిచ్చు!

కొత్త చిచ్చు! - Sakshi

మంత్రి పదవి ఆశల చుట్టూ రాజకీయం

- భూమా వైపు మొగ్గితే తాముండబోమంటున్న శిల్పా?

- సీఎం వద్ద పంచాయితీకి నిర్ణయం

- ఎన్నికలు వస్తే స్వతంత్రంగానైనా పోటీకి సిద్ధం

- భూమాను ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతామని స్పష్టీకరణ

 

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘ఎన్నికల ముందు నుంచీ పార్టీలో ఉన్నాం. మమ్మల్ని పట్టించుకోకుండా కొత్తగా వచ్చిన వారికి పదవులు అప్పగిస్తే పార్టీకే నష్టం. ప్రధానంగా భూమా నాగిరెడ్డికి ఏకంగా మంత్రి పదవి ఇస్తామంటే ఒప్పుకోం. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో మేం ఎలా కొనసాగగలం. మంత్రి పదవి కావాలంటే ఎమ్మెల్యేకు రాజీనామా చేయాల్సిందే. అదే జరిగితే భూమాకు వ్యతిరేకంగా మేం ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేస్తాం. సహకరించే అవకాశమే లేదు. ఇదే విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి విన్నవించాలని భావిస్తున్నాం.’’ ఇవీ తన ప్రధాన అనుచరులతో శిల్పా బ్రదర్స్‌ చెబుతున్న మాటలు. ఈ నేపథ్యంలో మరోసారి నంద్యాల రాజకీయం రసకందాయంలో పడబోతుందని అర్థమవుతోంది. తెలంగాణలో జరిగిన మంత్రి తలసాని ఎపిసోడ్‌తో.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కొత్తగా ఎవ్వరికీ మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదనేది శిల్పా వర్గీయుల భావనగా ఉంది. ఎన్నికలు తప్పవని.. ఇదే జరిగితే తాము స్వతంత్రంగా పోటీ చేసి సత్తా చాటుతామని కూడా వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. ఇదీ ఇప్పుడు అధికార పార్టీలో మరింత కాక పుట్టిస్తోంది. 

 

ఎన్నికలొస్తే..

వాస్తవానికి తెలంగాణలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే తలసానికి మంత్రి పదవి అప్పగించారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ తీరుపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు వెళ్లాయనే ప్రచారం ఉంది. దీంతో గవర్నర్‌కు కేంద్ర హోంశాఖ లేఖ పంపిందని కూడా తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మంత్రి పదవులు లభించే అవకాశం లేదని స్వయంగా అధికార పార్టీ నేతలే పేర్కొంటున్నారు. భూమాకు మంత్రి పదవి రావాలంటే కచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో నంద్యాల అసెంబ్లీలో ఉప ఎన్నికలు తథ్యమని కూడా అధికార పార్టీలో వాదన ఉంది.

 

ఒకవేళ భూమాకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించి.. ఉప ఎన్నికలకు సిద్ధపడితే తమ నేత కూడా బరిలో ఉంటారని శిల్పా వర్గీయులు పేర్కొంటున్నారు. పోటీలో తమ నేత గెలిచినా, గెలవకపోయినా భూమాను మాత్రం కచ్చితంగా ఓడిస్తామని స్పష్టం చేస్తున్నారు. అయితే, ఈ విషయాన్ని స్పష్టంగా అధినేతకు వివరించిన తర్వాతే తమ నిర్ణయం ఉంటుందని వక్కాణిస్తున్నారు. కాగా.. ఎన్నికలు వచ్చి ఓడిపోతే పార్టీ పరువు బజారున పడుతుందని అధికార పార్టీలో అలజడి రేగుతోంది. ఇదిలాఉంటే తమ నేతకు మాత్రం కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని భూమా వర్గీయులు ధీమాగా ఉన్నారు. 

 

ఆదీ నుంచి సమన్వయలేమి..!

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవనే సామెతకు అనుగుణంగా.. నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ, కోడుమూరు, కర్నూలు, శ్రీశైలం నియోజకవర్గాల్లో ఇదే జరుగుతోందనే వాదన అధికారపార్టీలో వినిపిస్తోంది. పైకి ఎంత బహిరంగంగా విమర్శలు చేసుకోకపోయినప్పటికీ లోలోపల మాత్రం పాత నేతలు కొత్త నేతల రాకపై మండిపడుతున్నారు. పైగా తమ అధినేత కూడా కొత్తగా వచ్చిన వారికే పట్టం కడుతున్నారని వాపోతున్నారు.

 

ఈ పరిస్థితుల్లో పాత నేతలంతా కలిసి తమ స్థానానికి కన్నం పెట్టే ప్రయత్నాలు పార్టీ నుంచే జరిగితే సహించేది లేదని తేల్చి చెప్పాలని నిర్ణయించుకున్నారు. తమకంటూ ఒక అసెంబ్లీ నియోజకవర్గం లేకపోతే.. తమకు విలువ ఏముంటుందని మదనపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాత నేతలంతా కలిసి అధినేతను కలవాలనే చర్చ కూడా సాగుతున్నట్టు సమాచారం. మొత్తం మీద మంత్రి పదవి వ్యవహారం కాస్తా అధికార పార్టీలో అగ్గి రాజేస్తోంది.
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top