విజిలెన్స్‌ అధికారులమంటూ నగలు చోరీ

విజిలెన్స్‌ అధికారులమంటూ నగలు చోరీ - Sakshi


లబోదిబోమన్న బాధితురాలు



నాయుడుపేటటౌన్‌ (సూళ్లూరుపేట): విజిలెన్స్‌ అధికారులమని, బంగారు నగలకు ఖచ్చితంగా బిల్లులు ఉండాలని చెప్పి భయబ్రాంతులకు గురి చేసి ఓ మహిళ వద్ద నుంచి 38 గ్రాముల బంగారు నగలను తస్కరించారు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం నాయుడుపేట పట్టణంలో జరిగింది. బాధితురాలి వివరాల మేరకు పట్టణంలోని అమరాగార్డెన్‌ వీధిలో నివాసముంటున్న చేని దాసరి మస్తానమ్మ ఓ టిఫిన్‌ అంగట్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో దుకాణం నుంచి ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో మోటార్‌బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను రోడ్డుపై నిలిపారు.



మేము విజిలెన్స్‌ అధికారులమని మోదీ కొత్తగా విడుదల చేసిన జీఓ ప్రకారం బంగారు నగలకు రసీదులు ఉండాలన్నారు. మహిళ వేసుకున్న బంగారు నగలకు రసీదులు ఉన్నాయా అంటూ ఆరా తీశారు. దీంతో ఆమె కంగారుపడిపోయింది. అప్పుడే ఓ యువకుడు బ్యాగ్‌తో వస్తుండడంతో ఆతనిని కూడా ఆ ఇద్దరు వ్యక్తులు పిలిచారు. ఆ యువకుడు మెడలో వేసుకున్న చైన్, ఉంగరాలను చూసి వీటికి రశీదులు ఉన్నాయంటూ నిలదీశారు. దీంతో ఆ యువకుడు కొంత నగదు ముట్టచెప్పడంతో బంగారు నగలను తీసి భద్ర పరుచుకోవాలని ఓ కాగితంలో చుట్టు యువకుడికి ఇచ్చేశారు.



ఆ మహిళ మెడలో ఉన్న మంగళసూత్రంతోపాటు బంగారు చైన్‌ను తీసి ఇచ్చింది. ఆ ఇద్దరు వ్యక్తులు ఓ కాగితంలో చుట్టి ఆమెకు ఇచ్చారు. కొద్ది దూరం వెళ్లి చూసుకునే సరికి అందులో చిన్నపాటి రాళ్లు ఉండడంతో గగ్గోలు పెట్టింది. అయితే అప్పటికే ఆ ఇద్దరు వ్యక్తులు బ్యాగ్‌తో వచ్చిన యువకుడితో కలిసి మోటార్‌బైక్‌పై ఉడాయించారు. మహిళ ఈ సంఘటనతో అస్వస్థతకు గురైంది. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు బాధితురాలికి వైద్యశాలలో చికిత్సలు చేయించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారిస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top