జేసీ ప్రభాకర్‌ గూండాగిరీ | Sakshi
Sakshi News home page

జేసీ ప్రభాకర్‌ గూండాగిరీ

Published Sat, Mar 4 2017 10:52 PM

జేసీ ప్రభాకర్‌ గూండాగిరీ - Sakshi

- ‘సాక్షి’ ఎడిషన్‌ కార్యాలయం ఎదుట అనుచరులతో కలిసి హల్‌చల్‌
- బస్సు ప్రమాద ఘటనపై నిజాలు రాయడాన్ని జీర్ణించుకోలేకపోయిన వైనం
- స్థాయి, సభ్యత, సంస్కారం మరచి దురుసు ప్రవర్తన
- తాడిపత్రి ఎమ్మెల్యే తీరును తప్పుబడుతున్న అన్ని వర్గాల ప్రజలు


(సాక్షి ప్రతినిధి, అనంతపురం)
రాజకీయ కుటుంబం.. 60 ఏళ్లకు పైబడి వయస్సు..తొలిసారి ఎమ్మెల్యే.. భవిష్యత్‌  తరాలకు ఆదర్శంగా నిలవాల్సిన నాయకుడు.. అలాంటి వ్యక్తి నోటి నుంచి వెలువడే ప్రతిమాట జాగ్రత్తగా, హుందాగా ఉండాలి. కానీ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నీ మరచిపోయారు. విచక్షణ కోల్పోయారు. కాదు..కాదు..సభ్యత, సంస్కారం లేకుండా ప్రవర్తించారు. దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాద ఘటనపై ‘సాక్షి’ నిజాలు రాయడాన్ని, బాధితుల తరఫున ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించడాన్ని జేసీ ప్రభాకర్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. శనివారం అనుచరులతో కలిసి వచ్చి అనంతపురంలోని ‘సాక్షి’ ఎడిషన్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.

తానో ప్రజాప్రతినిధి అనే విషయం మరచిపోయి దుందుడుకు ప్రవర్తనతో రెచ్చిపోయారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగారు.  పత్రికల్లో రాయలేని, గౌరవప్రదమైన వ్యక్తులు చర్చించుకోలేని.. ఒక్కమాటలో చెప్పాలంటే  ‘అది నోరా...తాటిమట్టా?’ అనేలా మాట్లాడారు. తద్వారా తనను తాను దిగజార్చుకున్నారు. ఎమ్మెల్యే పదవి గౌరవాన్ని దిగజార్చేలా, రాజకీయవ్యవస్థ సిగ్గుపడేలా ప్రవర్తించారు.

జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యలపై జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రజాజీవితంలో ఉన్నవారు తమపై వచ్చిన ఎలాంటి ఆరోపణలకైనా సమాధానం చెప్పాలి.. కానీ ఇలా స్థాయిని మరచి మాట్లాడం సంస్కారం కాదని తప్పుబడుతున్నారు. తోటి ప్రజాప్రతినిధులను గౌరవించాలనే విజ్ఞతను గుర్తురెగాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా తాను ఏం మాట్లాడారో ప్రభాకర్‌రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని హితవు పలుకుతున్నారు.

Advertisement
Advertisement