ప్రకృతి రమణీయతకు ఆలవాలమై.. పర్యావరణ హితానికి పట్టుగొమ్మై. మనిషి మనుగడకు మహా ప్రసాదమై.. పుడమితల్లికి పచ్చల హారమై.
♦ నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలుగ్రామ పంచాయతీకి 40వేలు
♦ 6.31 లక్షల ఈత, ఖర్జూర మొక్కలకు అబ్కారీ శాఖ ప్రతిపాదనలు
♦ అందుబాటులో పండ్ల రకాలకు చెందిన 5.29 లక్షల మొక్కలు
♦ 2.78 లక్షల టేకు మొక్కలను అభివృద్ధి చేసిన డ్వామా
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రకృతి రమణీయతకు ఆలవాలమై.. పర్యావరణ హితానికి పట్టుగొమ్మై. మనిషి మనుగడకు మహా ప్రసాదమై.. పుడమితల్లికి పచ్చల హారమై.. తెలంగాణ ప్రజా జీ‘వనం’ పరిఢవిల్లే సుగమ మార్గానికి అడుగులు పడనున్నాయి. శుక్రవారం రెండో విడత హరితహారానికి అంకురార్పణ జరగనుంది. జిల్లాలో దాదాపు రెండున్నర కోట్ల మొక్కలు నాటేందుకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వర్షాభావంతో గతేడాది మిగిలిపోయిన మొక్కలకు ఊపిరిలూదాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 157 నర్సరీల్లో మొక్కలకు ప్రాణం పోసింది. ఇందులో 142 ప్రైవేటు నర్సరీలున్నాయి.
గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్ మొయినాబాద్ మండలం చిలూకూరులోని బాలాజీ సన్నిధిలో సంపంగి మొక్కను నాటి ‘హరితహారం’ కార్యక్రమానికి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఈ సారి కూడా ఆయన తొలి రోజు పర్యటన జిల్లా నుంచే సాగుతోంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో జరిగే హరితహారం కార్యక్రమానికి ఆయన రోడ్డు మార్గం ద్వారా వెలుతున్నారు. ఈ నేపథ్యంలో హయత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో సీఎం చేతుల మీదుగా మొక్కలు నాటించాలని స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే, సీఎం పర్యటన షెడ్యూల్‌లో ఇది లేనందున ఇక్కడ ఆగుతారో లేదో చూడాలి!
పండ్ల మొక్కలు.. వృక్షజాతులు
హరితహారం కింద వివిధ రకాల మొక్కలను పంపిణీ చే యడానికి అధికారయంత్రాంగం సన్నాహాలు చేసింది. ఇప్పటికే నర్సరీల్లో అందుబాటులో ఉంచిన ఈ మొక్కలను నేటి నుంచి ప్రజలకు అందించనుంది. పెరట్లో నాటే మొక్కలేకాకుండా.. నీడనిచ్చే వృక్షజాతులు, ఫల సాయం అందించే మొక్కలను పంపిణీ చేయనుంది. ఇందులో టేకు, ఖర్జూర, ఈత, మామిడి, జామ, తులసి, కరివేపాకు, వేప తదితర మొక్కలున్నాయి. మరోవైపు మొక్కలు నాటడానికి వీలుగా గుంతలను తీసి సిద్ధంగా ఉంచారు.
చెరువు గట్లపై ఈత, ఖర్జూర మొక్కలు పొలం గట్లపై టేకు నాటడానికి ప్రతిపాదనలు తయారు చేశారు. హరితహారం పర్యవేక్షణకు గ్రామానికో అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. గ్రామాలకు సరిపడా మొక్కల ఇండెంట్‌ను జిల్లా యంత్రాంగం ఎంపీడీఓల నుంచి సేకరించింది.
నాటడం కాదు పరిరక్షణ ముఖ్యం..
‘మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో.. వాటిని పరిరక్షించడం అంతకంటే ముఖ్యం. మొక్కనాటే ప్రతి పౌరుడు ఇది గుర్తెరగాలి. హరితహారం కింద 2.53 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించాం. ఇందులో 70శాతం మొక్కలు నర్సరీల్లో సిద్ధంగా ఉన్నాయి. మిగతావి సెప్టెంబర్ నాటికీ అందుబాటులోకి వస్తాయి. ఈ నెల 11న ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాట నున్నాం. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ సౌజన్యంతో చేపట్టే ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగు లక్షల మొక్కలను జిల్లాల్లో పెడతాం. 50 మొక్కలకంటే ఎక్కువ నాటితే వాటి నిర్వహణకు ఆర్థిక చేయూతనిస్తాం’ - కలెక్టర్ రఘునందన్‌రావు