ఈనెల 30 వరకు పాత వైన్‌షాపులకు గడువు.. డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్సీల చేతుల్లోకి
రాష్ట్ర వ్యాప్తంగా 2,620 వైన్‌షాపులు...
తొలివిడత ఫీజు చెల్లిస్తేనే మద్యం విక్రయాలకు అనుమతి
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో 2025–27 ఎక్సైజ్ పాలసీ అమల్లోకి రానున్న నేపథ్యంలో కొత్తగా వైన్‌షాపులు దక్కించుకున్న వారికి లైసెన్సులు జారీ చేసే ప్రక్రియను ఎక్సైజ్ శాఖ ప్రారంభించింది. డ్రా ద్వారా షాపులు దక్కించుకున్న యజమానులు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించిన వెంటనే లైసెన్సులు ఇవ్వాలని, ఈ ప్రక్రియను గురువారం నుంచి ప్రారంభించాలని ఎక్సైజ్ కమిషనర్ సి.హరికిరణ్ ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వచ్చే నెల 1వ తేదీ నుంచి వైన్‌షాపులు కొత్త లైసెన్సీల చేతుల్లోకి వెళ్లనున్నందున.. రాష్ట్రంలోని 2,620 వైన్‌షాపులకు కొత్త లైసెన్సులు మంజూరు చేయనున్నారు. ఇందుకుగాను తొలి విడత లైసెన్సు ఫీజులు చెల్లించిన తర్వాత కొత్త లైసెన్సీలకు మద్యం విక్రయించే అనుమతులు ఇస్తారు.
రంగారెడ్డి ఎక్సైజ్ జిల్లాలోని 514 మద్యం షాపులకు లైసెన్సులు జారీ చేసే ప్రక్రియపై ఆ శాఖ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ బుధవారం నాంపల్లిలోని ఎక్సైజ్ కార్యాలయంలో సమీక్షించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్న ఈ సమావేశంలో కొత్త లైసెన్సుల జారీలో అనుసరించాల్సిన విధివిధానాలను డీసీ దశరథ్ వివరించారు.
బకాయిలు వసూలు చేయండి
ఈనెల 30వ తేదీతో పాత లైసెన్సుల కాలం ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుతం నడుస్తున్న షాపులకు సంబంధించిన బకాయిలు వసూలు చేయడంపై కూడా ఎక్సైజ్ శాఖ దృష్టి సారించింది. ఈ మధ్యకాలంలో మద్యం అమ్మకాలు తగ్గకుండా చూడాలని, టార్గెట్ల మేరకు విక్రయాలు జరిగేలా చూడాలని స్థానిక ఎక్సైజ్ సిబ్బందికి సూచించింది.
కొత్తగా షాపులు రాని పాత యజమానులు లాభం కోసం అక్రమాలకు పాల్పడకుండా చూడాలని, వైన్‌షాపులతోపాటు బార్లకు సంబంధించిన బకాయిలపై దృష్టి పెట్టాలని, అన్ని బార్లు రెన్యువల్ అయ్యేలా చూడాలని, ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీఎఫ్ బృందాలు ఎక్సైజ్ నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని కూడా ఎక్సైజ్ శాఖ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.


