కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోకి బార్ అండ్ రెస్టారెంట్లు
లైసెన్సు ఉంటే ఔటర్ చుట్టూ ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు
గతంలో జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలంటూ పరిమితులు
వచ్చే కేబినెట్ భేటీలో 2బీ విధానాన్ని సవరించనున్న సర్కారు!
సాక్షి, హైదరాబాద్: బార్ అండ్ రెస్టారెంట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో జీహెచ్‌ఎంసీ, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఉన్న బార్లను ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనల మేరకు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలోకి తీసుకురానుంది. దీంతో బార్ అండ్ రెస్టారెంట్ల ప్రాంతీయ పరిధి పెరగనుంది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని.. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలపనుందని ఎక్సైజ్ వర్గాలంటున్నాయి.
ప్రస్తుతం ఎక్కడివక్కడే...
రాష్ట్రంలో దాదాపు 60 శాతం మద్యం విక్రయాలు జీహెచ్‌ఎంసీ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లోని వైన్‌షాపుల (ఏ4) ద్వారానే భారీగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. దీనివల్ల బార్ అండ్ రెస్టారెంట్ల (2బీ) మనుగడ రానురాను ప్రశ్నార్థకంగా మారుతోంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ (కోర్ హైదరాబాద్) పరిధిలోని బార్ల నిర్వహణ యజమానులకు కష్టతరమవుతోంది. దీంతో బార్ల లైసెన్సులు కూడా రెన్యూవల్ కావట్లేదు.
చాలా కాలంగా రెన్యూవల్ చేయని బార్ల లైసెన్సులను రద్దు చేసి కొత్తగా ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ ఆశించిన స్పందన రాలేదు. హైదరాబాద్ పరిధిలో ఆదాయం తక్కువగా ఉండగా ఓఆర్‌ఆర్, శివారు ప్రాంతాల్లో బార్లకు డిమాండ్ బాగా కనిపిస్తోంది. ఎక్సైజ్ చట్టం ప్రకారం జీహెచ్‌ఎంసీ, శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని బార్ అండ్ రెస్టారెంట్లకు పరిమితులున్నాయి. ఏ ప్రాంతంలోని బార్లు ఆ ప్రాంతంలోనే ఏర్పాటు చేసుకోవాల్సి వస్తోంది.
ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ, శివారు ప్రాంతాల్లోని బార్ల లైసెన్సుల పరిధి పెంచాలంటూ ఎక్సైజ్ శాఖ ప్రభుత్వాన్ని చాలా కాలంగా కోరుతోంది. తద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల తీసుకున్న బార్ లైసెన్సును ఏ మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అయినా వినియోగించుకునే వెసులుబాటు యజమానులకు లభిస్తుందని చెబుతోంది. ఈ ప్రతిపాదనను పరిశీలించిన ప్రభుత్వం హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లోని బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్సులన్నింటినీ టీసీయూఆర్ పరిధిలోనికి తీసుకురావాలని నిర్ణయించింది.
ఈ మేరకు వచ్చే కేబినెట్‌లో ఎక్సైజ్ చట్టంలోని 2బీ షాపుల విధానానికి సవరణలను ఆమోదించనుందని సమాచారం. అదే జరిగితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్సులకు గిరాకీ పెరగడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయమూ పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.


