
కోరిక తీర్చలేదని చంపేశాడు
ప్రియుడి స్నేహితుడు ఆమెపై కన్నేశాడు. కామవాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు.
యువతి పాలిట కాలయముడైన ప్రియుడి స్నేహితుడు
బుచ్చిరెడ్డిపాళెం (కోవూరు) : ప్రియుడి స్నేహితుడు ఆమెపై కన్నేశాడు. కామవాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. చివరకు కాలయముడిలా మారి ఆమెను హతమార్చాడు. అదే సమయంలో ఆమె ప్రియుడు అక్కడకు చేరుకున్నా మౌనం వహించాడు. హంతకుడితో కలిసి యువతి మెడలోని బంగారు నగలతో ఉడాయించాడు. యువతి అదృశ్యం కేసు కీలక మలుపులు తిరిగి.. చివరకు హత్య కేసుగా తేలింది. వివరాల్లోకి వెళితే.. బుచ్చిరెడ్డిపాళెం మండలం కట్టుబడిపాళేనికి చెందిన చీదెళ్ల జయంతి అనే యువతి ఖాదర్‌నగర్‌కు చెందిన వివాహితుడు మస్తాన్‌తో ఈ ఏడాది జనవరిలో వెళ్లిపోయింది. వారిద్దరూ జనవరి 7వ తేదీన తిరుమలలో వివాహం చేసుకున్నారు. మరునాడు కట్టుబడిపాళెం చేరుకున్నారు.
ఈ వ్యవహారంపై మస్తాన్ ఇంట్లోను, జయంతి ఇంట్లోను వివాదం రేగింది. దీంతో ఇద్దరూ కలిసి వేరేచోటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు మస్తాన్ తన స్నేహితుడైన నాయుడుపేటకు చెందిన నరేష్‌ను సాయం కోరారు. మస్తాన్, జయంతి, నరేష్ కలిసి 9వ తేదీన హైదరాబాద్‌కు బయల్దేరారు. పదో తేదీ అక్కడకు చేరుకున్నారు. సిటీ బస్సు ఎక్కి నిర్మల్‌లోని శివారు ప్రాంతమైన శాంతినగర్‌కు వెళ్లారు. అక్కడ కూర్చుని ఎక్కడ ఉండాలి, ఏం చేయాలనే విషయాలను చర్చించారు. అనంతరం మస్తాన్ బహిర్భూమికి వెళ్లాడు. అప్పటికే జయంతిపై కన్నేసిన నరేష్ ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. జయంతి ప్రతిఘటించడంతో పీకపిసికి చంపేశాడు. తిరిగొచ్చిన మస్తాన్‌కు జరిగిన విషయం చెప్పడంతో ఏం చేయాలో తెలియక ఆలోచనలో పడ్డారు. విషయం బయటకు తెలియకుండా జయంతి నోట్లో పురుగు మందు పోశారు. ఆమె ఒంటిపై ఉన్న రెండున్నర సవర్ల బంగారు ఆభరణాలను తీసుకుని ఉడాయించారు. జనవరి 11న ఆమె మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. నిర్మల్ ఎస్సై సునిల్‌కుమార్ గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించినట్టుగా కేసు నమోదు చేశారు. ఆమె హత్యకు గురైనట్టు పోస్టుమార్టంలో తేలడంతో సెక్షన్ 302గా కేసు మార్చారు.
విచారణలో భాగంగా...
జయంతి కనబడటం లేదని జయంతి తల్లి అంకమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై ఈ ఏడాది మార్చిలో బుచ్చిరెడ్డిపాళెం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులకు మస్తాన్, నరేష్ విషయం తెలిసింది. ఇరువురిని రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు వారిని నిర్మల్ తీసుకెళ్లారు. గుర్తు తెలియని మృతదేహం జయంతిదేనని సీఐ సుబ్బారావు, ఎస్సై నాగశివారెడ్డి నిర్ధారించారు. దీంతో అక్కడి కేసు వివరాలను తీసుకుని బుచ్చిరెడ్డిపాళేనికి వచ్చారు. మస్తాన్, నరేష్‌ను విచారణ జరుపుతున్నారు. దీనిపై ఎస్సై నాగశివారెడ్డిని సంప్రదించగా జయంతి హత్య చేయబడిందన్న వార్త వాస్తవమేనన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.