జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు.
జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. కనగానపల్లి మండల పరిధిలోని భానుకోట సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి జార్ఖండ్ కూలీ మృతి చెందగా, కుమ్మరవాండ్లపల్లి సమీపంలో జరిగిన ప్రమాదంలో హరి అనే యువకుడు మృతి చెందాడు. అలాగే ఓడీ చెరువు మండలంలోని నాయనకోట వద్ద జరిగిన ప్రమాదంలో ఓబుళరెడ్డిపల్లికి చెందిన భారతి అనే వివాహిత మృత్యువాత పడింది. కర్ణాటక రాష్ట్రం తుమకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అమరాపురం మండల పరిధిలోని గౌడనకుంటకు చెందిన గొల్ల కుమార్ మృతి చెందాడు.
ఉపాధికి వెళుతూ..
ఓడీ చెరువు: ఓడీ చెరువు మండలంలోని నాయనకోట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓబుళరెడ్డిపల్లికి చెందిన భారతి (25) గురువారం మృతి చెందింది. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. ఓబుళరెడ్డిపల్లికి చెందిన సురేష్, భార్య భారతితో కలసి ద్విచక్రవాహనంలో స్వగ్రామం నుంచి జీవనోపాధి కోసం బెంగళూరుకు బయలుదేరారు. మార్గమధ్యంలో కొండకమర్ల సమీపంలోని నవాబుకోట మలువు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో భారతి అక్కడిక్కడే మృతి చెందింది. భర్త సురేష్ తలకు హెల్మెట్ ఉండటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎస్‌ఐ సత్యనారాయణ, ఏఎస్‌ఐ ఇస్మాయిల్ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కదిరికి తరలించారు.
నిమజ్జనానికి వెళుతూ..
అమరాపురం: మండల పరిధిలోని గౌడనకుంట గ్రామానికి చెందిన గొల్ల కుమార్(30) కర్ణాటక రాష్ట్రం తుమకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడు కుమార్, నాగరాజు బెంగళూరు నుండి బైక్‌లో గురువారం ఉదయం తమ స్వగ్రామానికి బయలు దేరి వచ్చారు. తుమకూరు వద్ద రోడ్డు డివైడర్‌కు ఢీ కొనడంతో కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజుకు తీవ్రగాయలయ్యాయి. అతన్ని తుమకూరులోని ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణపతి నిమజ్జన కార్యక్రమం శుక్రవారం నిర్వహిస్తుండడంతో అందులో పాల్గొనాలని వస్తూ్త ఇలా మృతి చెందడంతో గౌడనకుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ట్రాక్టర్ కింద పడి జార్ఖండ్ కూలీ..
కనగానపల్లి : మండల పరిధిలోని భానుకోట సమీపంలో గురువారం ట్రాక్టర్ కింద పడి జార్ఖండ్‌కు చెందిన కూలీ సుధీర్ కుమార్(18) మృతి చెందాడు. వివరాలిలా ఉన్నా యి. వేపకుంట, మద్దులచెరువు గ్రామాల సమీపంలో గాలిమరలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో పనిచేసేందుకు జార్ఖండ్ నుంచి కూలీలు వచ్చారు. వీరిలో సుధీర్‌ను ఓ ట్రాక్టర్‌లో భానుకోటకు వెళ్లారు. అయితే మార్గమధ్యలో అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో డ్రైవర్ పక్కన కుర్చున్న సుధీర్ ఇంజన్‌లో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వ్యక్తి దుర్మరణం..
కదిరి అర్బన్ : రూరల్ మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి సమీపంలో లఘువమ్మ కొండ వద్ద కదిరి–రాయచోటి రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్‌పీకుంట మండలం కొండలోల్లపల్లికి చెందిన హరి(35) దుర్మరణం చెందగా పవన్‌కల్యాన్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మృతుడికి భార్య,కుమారుడు ఉన్నారు. పవన్‌కళ్యాన్‌ను స్థానికులు కదిరి ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి తిరుపతికి తరలించారు.