అసువులు తీసిన అప్పులు | formar comited to suside | Sakshi
Sakshi News home page

అసువులు తీసిన అప్పులు

Oct 19 2016 11:38 PM | Updated on Sep 4 2017 5:42 PM

అసువులు తీసిన అప్పులు

అసువులు తీసిన అప్పులు

ట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఓ రైతు అసువులు తీశాయి. వరుస నష్టాలు అతడిని నిలబడనివ్వలేదు. బ్యాంక్‌ నుంచి అప్పు తీసుకుని కాస్త ఉపశమనం పొందుదామంటే.. అతడి భూమి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. కుటుంబ సభ్యులకు గుప్పెడు మెతుకులు పెట్టే దారిలేక.. ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా చేరినా.. అప్పటికే చేసిన అప్పులు ఊపిరి సలపనివ్వలేదు. దిక్కులేని స్థితిలో ఆ రైతు ఉరికొయ్యను ఆశ్రయించి అసువులు తీసుకున

– ఉరి కొయ్యను ఆశ్రయించిన రైతు
– వరుస నష్టాలే కారణం
– భూమి వివరాలు ఆన్‌లైన్‌ కాకపోవడంతో మంజూరు కాని బ్యాంక్‌ రుణం
– ద్వారకాతిరుమల మండలం సీహెచ్‌.పోతేపల్లిలో ఘటన
 
ద్వారకాతిరుమల :
పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు ఓ రైతు అసువులు తీశాయి.   వరుస నష్టాలు అతడిని నిలబడనివ్వలేదు. బ్యాంక్‌ నుంచి అప్పు తీసుకుని కాస్త ఉపశమనం పొందుదామంటే.. అతడి భూమి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. కుటుంబ సభ్యులకు గుప్పెడు మెతుకులు పెట్టే దారిలేక.. ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలో రోజువారీ కూలీగా చేరినా.. అప్పటికే చేసిన అప్పులు ఊపిరి సలపనివ్వలేదు. దిక్కులేని స్థితిలో ఆ రైతు ఉరికొయ్యను ఆశ్రయించి అసువులు తీసుకున్నాడు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్‌.పోతేపల్లిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ దుర్ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. కామవరపుకోట మండలం తూర్పు యడవల్లికి చెందిన ఆకుల సత్యనారాయణ (34) ద్వారకాతిరుమల మండలం సీహెచ్‌.పోతేపల్లిలోని తన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికులను కలచివేసింది.
రూ.లక్షలు పెట్టుబడి పెడితే చిల్లగవ్వ కూడా రాలేదు
దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంకు చెందిన ఆకుల సత్యనారాయణకు కామవరపుకోట మండలం తూర్పు యడవల్లికి చెందిన హేమలతతో 15 సంవత్సరాలు క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. వివాహానంతరం సత్యనారాయణ తూర్పు యడవల్లిలో స్థిరపడ్డాడు. ద్వారకాతిరుమల మండలం సీహెచ్‌.పోతేపల్లిలో 75 సెంట్ల వ్యవసాయ భూమి భార్యద్వారా సంక్రమించగా.. ఆ పొలంతోపాటు పక్కనే ఉన్న మరో ఎకరం భూమిని సత్యనారాయణ కౌలుకు తీసుకుని మూడేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాడు. మిరప, నిమ్మ, దొండ పంటలను సాగు చేస్తున్నాడు. దొండ సాగు అతడిని నష్టాల ఊబిలోకి నెట్టేసింది. ఐదు నెలల క్రితం నాటిన దొండపాదులు ఎండిపోవడంతో వెంటనే అప్పులు చేసి మళ్లీ అదే పంట వేశాడు. ఆ పాదులు కూడా ఎండిపోవడంతో నిరాశకు గురయ్యాడు. దాదాపు రూ.3 లక్షల మేర పెట్టుబడులు పెడితే చిల్లిగవ్వ కూడా రాకపోవడంతో కుటుంబ సభ్యులను పోషించుకోవడం కష్టమైంది. ఆర్థిక ఇబ్బందులను తాళలేక సీహెచ్‌.పోతేపల్లిలోని గోద్రేజ్‌ ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీలో గెలల అన్‌లోడింగ్‌ చేసే పనిలో కూలీగా చేరాడు. వ్యవసాయంపై మక్కువ చావక తన పొలంలో మరోసిరొ మిరప పంట వేశాడు. భార్యద్వారా సంక్రమించిన భూమిపై బ్యాంకు రుణం తీసుకుని ప్రై వేట్‌ అప్పుల్లో కొంతైనా తీర్చి ఉపశమనం పొందాలనుకున్నాడు. భూమి రికార్డులు ఆన్‌లైన్‌ కాకపోవడంతో రుణం ఇవ్వడం కుదరదని బ్యాంక్‌ అధికారులు తేల్చిచెప్పారు. మూడేళ్లపాటు దఫదఫాలు చేసిన అప్పులు రూ.5 లక్షల వరకు చేరడంతో ఎలా తీర్చాలో తెలియక సత్యనారాయణ సతమతమయ్యేవాడు. ఇదే విషయాన్ని తమ వద్ద పదేపదే అంటుండేవాడని భార్య హేమలత, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చివరకు తన పొలంలోనే చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణం పొందాడు. సత్యనారాయణ, హేమలత దంపతులకు సురేష్‌కుమార్‌ (15), హరీష్‌ (13) అనే కుమారులున్నారు.
‘అమ్మను పొలానికి రావద్దను’
 రోజులానే మంగళవారం ఉదయం ఇంటినుంచి బయల్దేరిన సత్యనారాయణ పొలానికి చేరుకున్నాడు. మిరప పంటకు తడిపెట్టే సమయంలో అతని చిన్న కుమారుడు హరీష్‌ టిఫిన్‌ తీసుకెళ్లాడు. టిఫిన్‌ చేసిన అనంతరం పొలం నుంచి ఇంటికి వెళుతున్న కుమారుణ్ణి వెనక్కి పిలిచిన సత్యనారాయణ ‘మధ్యాహ్నం మీ అమ్మ పొలానికి వస్తుందేమో.. రావద్దని చెప్పు. సాయంత్రం నేనే ఇంటికి వచ్చేస్తాను’ అని చెప్పి పంపాడు. అతని రాక కోసం రాత్రి వరకు ఎదురు చూసిన భార్య హేమలత ఆ తరువాత భర్తను వెదుక్కుంటూ పొలానికి బయలుదేరింది. సమీపంలోని పొలానికి చెందిన రైతు ఆమెకు ఎదురై నీ భర్త పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడని చెప్పడంతో నిర్ఘాంతపోయింది. భోరున విలపిస్తూ్త ఘటనా స్థలానికి చేరుకుంది. అప్పుల బాధలే తన భర్తను పొట్టన పెట్టుకున్నాయని భార్య హేమలత రోదిస్తోంది. అందరితో కలివిడిగా ఉండే సత్యనారాయణ మతిచెందాడన్న వార్త తెలుసుకున్న తోటి రైతులు, ఇంటి చుట్టుపక్కల వారు అక్కడకు చేరుకున్నారు. మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయాక పోలీసులకు సమాచారం అందగా, బుధవారం ఉదయం భీమడోలు ఎసై ్స బి.వెంకటేశ్వరరావు, ద్వారకాతిరుమల స్టేషన్‌ రైటర్‌ టి.వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య హేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement