హర్యానా: గురుగ్రామ్ వజీర్‌పూర్‌లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన నలుగురు పిల్లలతో పాటు తన భార్యని చంపారు. అనంతరం తాను ఆత్మహత్యకు యత్నించగా ప్రాణాలతో బయిటపడ్డారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు ఓ వ్యక్తి కుటుంబం గత కొంతకాలంగా వజీర్‌పూర్‌లో నివాసం ఉంటుంది. ఇతను స్థానికంగా సెలూన్ నడుపుతాడు. అయితే శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో అతని సోదరుడు ఇంటికి వచ్చేసరికి కుటుంబ సభ్యులంతా అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తీసుకెళ్లగా మహిళ మరియు నలుగురు పిల్లలు అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. నిందితుడి పరిస్థితి సైతం విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనలో 35 ఏళ్ల భార్య, 14, 12, 10 ఏళ్ల వయస్సు గల ముగ్గురు కుమార్తెలు మరియు 8 ఏళ్ల కుమారుడు మృతిచెందారు. అయితే వివరాలు తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా గృహ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం నిందితుడు తొలుతగా కుటుంబ సభ్యులకు విషం ఇచ్చి అనంతరం కత్తితో తన మణికట్టును కోసుకున్నాడని తెలిపినట్లు పేర్కొన్నారు. కుటుంబసభ్యులు జీవించడానికి ఇష్టపడలేదని నిందితుడు చెప్పినట్లు పేర్కొన్నారు.. విషం ఇచ్చారా లేక గొంతు నులిమి చంపారా అనేది దర్యాప్తులో తేలుతుందని, ప్రస్తుతం అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.


