విద్యుత్‌ స్టోర్స్‌లో అగ్నిప్రమాదం | Fire accedent in the electrical stores | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్టోర్స్‌లో అగ్నిప్రమాదం

Apr 12 2017 10:27 PM | Updated on Sep 5 2018 9:45 PM

విద్యుత్‌ స్టోర్స్‌లో అగ్నిప్రమాదం - Sakshi

విద్యుత్‌ స్టోర్స్‌లో అగ్నిప్రమాదం

జిల్లా విద్యుత్‌ స్టోర్స్‌లో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదం స్థానికులను భయాందోళనకు గురి చేసింది.

►  నిప్పు రవ్వలు పడి భారీగా వ్యాపించిన అగ్నికీలలు
►  కృష్ణానగర్, ఆర్‌ఆర్‌వీపురం, దుర్గానగర్‌ ప్రాంతాల్లో కమ్మేసిన పొగ
►  మూడు గంటల పాటు ఉక్కిరిబిక్కిరి... భయాందోళనలో జనం


గోపాలపట్నం (విశాఖ పశ్చిమ) : జిల్లా విద్యుత్‌ స్టోర్స్‌లో మంగళవారం సంభవించిన అగ్నిప్రమాదం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. వివరాల్లోకి వెళ్తే... ఆర్‌ఆర్‌వీపురంలో ఉన్న సింహాచలం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ని ఆనుకుని ఏపీఈపీడీసీఎల్‌కు చెందిన జిల్లా విద్యుత్‌ స్టోర్స్‌ కేంద్రం ఉంది. ఇక్కడి నుంచే జిల్లా వ్యాప్తంగా మీటర్లు, హై టెన్షన్‌ వైర్లు, తదితర సామగ్రి సరఫరా చేస్తుంటారు. కేంద్రం ఆవరణలో పాడైన ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్లు, వైర్లు ఉంటాయి. అయితే ఇక్కడున్న 380 టన్నుల స్క్రాప్‌ని ఇటీవలే  కాంట్రాక్టర్‌కి వేలంలో కిలో రూ.12ల చొప్పున ఇచ్చేశారు.

మంగళవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో స్క్రాప్‌కి సంబంధించిన సామగ్రిని గ్యాస్‌ కట్టర్‌తో సరిచేస్తుండగా నిప్పు రవ్వలు ఒక్కసారిగా ఎగసి ఎండిన తుప్పలు, డొంకలకు అంటుకున్నాయి. ఇలా ఒక్కసారిగా అగ్నికీలలు వ్యాపించి అదుపు చేయలేని స్థాయికి ఎగిశాయి. భారీగా మంటలతో పాటు పెద్ద ఎత్తున పొగ వ్యాపించాయి. ఇక్కడి కృష్ణానగర్, ఆర్‌ఆర్‌వీపురం, దుర్గానగర్‌ తదితర కాలనీల వైపు పొగ కమ్మేయడంతో అంతా అలజడి రేగింది. జనం భయాందోళన చెందారు.

సమీప ఇళ్లలోని జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎల్‌జీ పాలిమర్స్, మర్రిపాలెం, ఎన్‌ఎస్‌టీఎల్‌ నుంచి అగ్నిమాపక శకటాల సిబ్బంది, అధికారులు చేరుకుని మంటలు అదుపు చేయడానికి విశ్వప్రయత్నాలు చేశారు. సాయంత్రం 6 గంటలకు మంటలు అదుపు చేయడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. మర్రిపాలెం ఫైర్‌ స్టేషన్‌ అధికారి సత్యరాజు తదితరులు ఇక్కడ సేవలందించారు. మంటలు చెలరేగడానికి కారణాలపై ఏడీఈ యజ్ఞేశ్వర్రావు, తదితర అధికారులు, సిబ్బందిని ఆరా తీశారు. ఆస్తి నష్టంపై అంచనాలు వేస్తున్నామని ఆయన తెలిపారు. ఇక్కడున్న 380 టన్నుల స్క్రాప్‌లో ప్లాస్టిక్‌ సామాగ్రి కూడా ఉండడం వల్ల మంటలు, పొగ అదుపులోకి రావడం ఆలస్యమయిందని చెప్పారు. రూ.2లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement