‘ఎగ్‌’ నామం

‘ఎగ్‌’ నామం

  • ప్రభుత్వ పాఠశాలల్లో ఉడకని మూడో గుడ్డు

  • ఆశగా ఎదురుచూస్తున్న విద్యార్థులు

  • విడవలూరు(కోవూరు):  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు పౌష్టికాహారాన్ని అందించాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఇందులో భాగంగా వారంలో రెండు రోజులు కోడిగుడ్డు ఇస్తున్నారు. అదనంగా మరొకటి అంటే వారానికి మూడు రోజులు విద్యార్థులకు కోడిగుడ్డు ఇవ్వాలని గత ఏడాది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు మూడో గుడ్డును విద్యార్థులకు అందించలేదు.  



    జిల్లాలో 46 మండలాల్లో 390 ఉన్నత పాఠశాలలు, 396 ప్రాథమికోన్నత పాఠశాలలు, 3,338 ప్రా«థమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 4 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి అందిస్తున్న మధ్యాహ్న భోజనంతో పాటు పౌష్టికాహారాన్ని అందించాలని  ఇప్పటికే వారంలో రెండు రోజులు కోడిగుడ్లను సరఫరా చేస్తున్నారు. అయితే మూడో గుడ్డును కూడా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి ఐదు మాసాలు గడిచిపోయింది. కాని ఇంత వరకు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడో గుడ్డును ఇవ్వలేదు.



    గత ఏడాది  అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఈ మూడో గుడ్డు విద్యార్థులకు అందించాల్సి ఉన్నా ఇంత వరకు ప్రభుత్వం దానికి సంబంధించిన నిధుల పెంపు విషయమై నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలను ఇవ్వలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో మూడో గుడ్డు అందించేందుకు ఒక్కొక్క విద్యార్థికి గతంలో ఇస్తున్న నిధులతో పాటు అదనంగా మరి కొంత పెంచి ఇస్తామని ప్రభుత్వం చెప్పి నెలలు దాటుతున్నా ఇంత వరకు ముందడుగు పడలేదు. ఈ విద్యా సంవత్సరం ముగింపునకు కొద్దిరోజులే వ్యవధి ఉంది. వచ్చే నెల 17వ తేదీ నుంచి 10వ తరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు ఉన్నాయి. అసలు ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు మూడో గుడ్డు మొహం చూస్తారన్న సందేహం నెలకొంది.



     పర్యవేక్షణ తప్పని సరి

    ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ప్రతి మంగళ, శుక్రవారాలు విద్యార్థులకు గుడ్డును మధ్యాహ్న బోజనంతో కలిపి అందిస్తున్నారు. అయితే కొన్ని పాఠశాలల్లో మంగళ, శుక్రవారాలకు అందాల్సిన గుడ్డు బుధ, శనివారం అందుతోంది. దీంతో ప్రతి నెలలో రెండో శనివారం విద్యార్థులకు గుడ్డు అందడం లేదు. దీనిపై సంబంధిత అధికారులు కూడా పర్యవేక్షణ చేయని కారణంగా నిర్వాహకులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మూడో గుడ్డు ఏ రోజు వేయాలో ఇంత వరకు నిర్వహకులకు, ఉపాధ్యాయులకు స్పష్టత లేదు. ఇప్పుడు కూడా ఉపాధ్యాయులు, అధికారుల పర్యవేక్షణ లేకపోతే మూడో గుడ్డు కూడా విద్యార్ధులకు అందకపోవచ్చు.  



    రెండు గుడ్లే అందుతున్నాయి

    మా బడిలో వారానికి రెండు గుడ్లు మాత్రమే అందుతున్నాయి.  మూడో గుడ్డు ఇవ్వడం లేదు. ఎప్పటి నుంచి ఇస్తారో తెలీదు. వారంలో ప్రతి మంగళవారం, శుక్రవారం మాత్రం భోజనంతో కలిపి ఇస్తున్నారు. మూడో గుడ్డు ఇస్తే మంచిది.  

    - అనిల్, నవీన్‌



    త్వరలోనే అమలు చేస్తాం

    గత ఏడాది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు మూడో గుడ్డు అందించాల్సి ఉంది, అయితే నిధులుSలేని కారణంగా కొంత ఆలస్యమైంది. ప్రస్తుతం ఒకటి రెండు చోట్ల మూడో గుడ్డు విద్యార్థులకు అందుతోంది. త్వరలోనే జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాము.

     -మువ్వా రామలింగం, డీఈఓ

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top