వసతిగృహానికి విద్యార్థులు కావలెను! | Dormitory students wanted | Sakshi
Sakshi News home page

వసతిగృహానికి విద్యార్థులు కావలెను!

Jul 2 2016 8:25 AM | Updated on Sep 4 2017 3:54 AM

జిల్లాలో ఎస్సీ కళాశాల విద్యార్థుల కోసం అధికారులు వసతి గృహాలు సిద్ధం చేసుకుని ఎదురుచూస్తున్నారు.

 బొబ్బిలి : జిల్లాలో ఎస్సీ కళాశాల విద్యార్థుల కోసం అధికారులు వసతి గృహాలు సిద్ధం చేసుకుని ఎదురుచూస్తున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఇదేదో తాజాగా చూసే ఎదురుచూపులు కావు. 11 ఏళ్లుగా సాగుతున్న నిరీక్షణ. జిల్లాలోని కాలేజీల్లో చదివే ఎస్సీ విద్యార్థుల కోసం 2005లో 20 వసతి గృహాలను ఏర్పాటు చేశారు. వాటిలో ఏడు వసతి గృహాలు మాత్రమే ప్రారంభమై నడుస్తున్నాయి. ప్రస్తుతం విజయనగరం జిల్లా కేంద్రంలో నాలుగు, బొబ్బిలిలో రెండు, ఎస్.కోటలో ఒక  వసతి గృహం చొప్పున ఉన్నాయి. వీటిలో దాదాపు 700 మంది వరకూ విద్యార్థులున్నారు.
 
  జిల్లాలో ఎస్సీ బాలురు, బాలికల వపతి గృహాలను ఏర్పాటు చేసి వాటిలో కనీసం వంద మంది వరకూ వసతి కల్పించాలని నిర్ణయించారు. 2005లో మంజూరైన ఈ వసతి గృ    హాలను ఎస్.కోటలో రెండు, కొత్తవలసలో రెండు చొప్పున ఏర్పాటు చేశారు. వాటిలో 30 మంది వరకూ విద్యార్థులు చేరి కొన్నాళ్లు ఉండి మళ్లీ మానేశారు. దాంతో ఆ నాలుగింటిని కూడా ఎత్తేశారు. అలాగే గజపతినగరం, సాలూరులలో ఒక్కొక్కటి, చీపురుపల్లిలో రెండు హాస్టళ్లు చొప్పున ఏర్పాటు చేశారు. అవి కూడా ఎన్నాళ్లూ ఉండలేదు.
 
 విద్యార్థులు చేరకపోవడం ఒక కారణమైతే.. మరో వైపు భవనాల సమస్య ఉంది. వసతి గృహాల కోసం ప్రైవేటు భవనాలు ఏవీ దొరకకపోవడంతో ఇబ్బందులు మరీ ఎక్కువవుతున్నాయి. ఇరుకైన గదుల్లో ఉండలేక విద్యార్థులు ఇంటిముఖం పడుతున్నారు. ప్రాథమిక స్థాయిలో ఉండే హాస్టల్స్‌ను ప్రభుత్వం ఎలాగూ ఎత్తివేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇక ఆ భవనాలనైనా వినియోగించుకుని కళాశాల వసతి గృహాలను పునరుద్ధరించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement