
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద ఎంపిక
నేడు ఢిల్లీలో అవార్డును అందుకోనున్న కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
విజయనగరం అర్బన్ బొబ్బిలి: ఇప్పటికే దేశ విదేశాల్లో విశేష ప్రాచుర్యం పొందిన బొబ్బిలి వీణ (Bobbili Veena) కు మరో అరుదైన గుర్తింపు లభించింది. వన్ డి్రస్టిక్ట్.. వన్ ప్రొడక్ట్ (ఓడీఓపీ) కింద బొబ్బిలి వీణ బహుమతికి ఎంపికైంది. ఓడీఓపీ అవార్డుకు రాష్ట్రం నుంచి 7 జిల్లాలకు చెందిన ఉత్పత్తులు ఎంపిక కాగా మన బొబ్బిలికి చెందిన నమూ నా వీణ ఎంపిక కావడం జిల్లాకు గర్వ కారణంగా నిలిచింది. ఈ పురస్కారాన్ని అందుకునేందుకు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఢిల్లీ వెళ్లారు. కొత్త ఢిల్లీ ప్రగతి మైదానంలో భారత్ మండపంలో సోమ వారం జరిగే కార్యక్రమంలో ఓడీఓపీ అవార్డును కలెక్టర్ అందుకోనున్నారు.
బొబ్బిలి వీణకు అంతర్జాతీయ గుర్తింపు
బొబ్బిలి వీణకు దేశ విదేశాల్లో ఎనలేని ఖ్యాతి ఉంది. బొబ్బిలి వీణ అని విస్తృతంగా పిలువబడే బొబ్బి లి నుంచి వచ్చిన సాంప్రదాయ ’సరస్వతి వీణ’ విలక్షణమైన స్వరాలకు ప్రసిద్ధి చెందింది. అలాగే సరస్వతి వీణను పోలి ఉండే చిన్నపాటి వీణను బహుమతిగా జ్ఞాపికగా ఇవ్వడం ఏళ్ల తరబడి సంప్రదాయంగా వస్తోంది. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులో సైతం బొబ్బిలి నమూనా వీణలను జ్ఞాపికలుగా ఇవ్వడం జరుగుతోంది. బొబ్బిలి వీణ బొమ్మలతో పోస్టల్ స్టాంపులు, నాణేలు కూడా ముద్రితమయ్యాయి. ఇతర రాష్ట్రాలకు సైతం బొబ్బిలి వీణలు ఎగుమతి అవుతున్నాయి. ఢిల్లీలో జరిగిన జీ–20 సదస్సులో, విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో సైతం బొబ్బిలి వీణ ప్రదర్శనలు జరిగాయి. అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ ఈ వీణను చూసి ముచ్చటపడ్డారు. బొబ్బిలి వీణకు ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం నుంచి భౌగోళిక గుర్తింపు కూడా లభించింది. బొబ్బిలి పట్టణానికి సమీపంలోని గొల్లపల్లి, బాడంగి మండలం వాడాడ వీణల తయారీకి ప్రసిద్ధి చెందిన గ్రామాలు. వీణల తయారీ ఒక అరుదైన హస్త కళగా గుర్తింపు పొందింది. ఈ గ్రామాల్లో దాదాపు 300 కుటుంబాలు తమ జీవనోపాధి కోసం వీణల తయారీలో నిమగ్నమై ఉన్నారు. వీటి తయారీకి పనస మరియు సంపంగి కలప, చెక్కకు ఉపయోగిస్తారు. వీణల తయారీకి కలప కొరతను నివారించేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తృతంగా పనస చెట్లను పెంచాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. ఓడీఓపీ కింద బొబ్బిలి వీణకు గుర్తింపు లభించడంతో వీటి ఖ్యాతి మరింత ఇనుమడిస్తుందనడంలో సందేహం లేదు.