ఎన్‌జీ రంగా యూనివర్శిటీలో పాలిటెక్నికల్, డిప్లామా కోర్సుల సీట్లు అయిపోయాయని రిజిస్ట్రార్ తెలిపారు.
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విద్యాలయం పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నికల్, డిప్లామా కోర్సుల సీట్లు అయిపోయాయని అభ్యర్ధులు ఇక కౌన్సిలింగ్‌కు రానవసరం లేదని యూనివర్శిటీ రిజిస్ట్రార్ డా.టీవీ సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలోని 53 కళాశాలల్లోని 2003 సీట్ల ప్రవేశాలకు గత నెల 28వ తేది నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం శనివారం వరకు జరగాల్సి ఉందన్నారు. గుంటూరు లాంఫారంలో జరిగిన ఈ కౌన్సిలింగ్‌కు 1:3 ప్రకారం అభ్యర్ధులను పిల్వగా వచ్చిన వారంతా ఆయా కోర్సులలో చేరిపోవడంతో సీట్లు అయిపోయాయని చెప్పారు. దీంతో ఇక అభ్యర్ధులు కౌన్సిలింగ్‌కు రానవసరం లేదన్నారు. అవసరం మేరకు రెండవ విడత కౌన్సిలింగ్‌కు అభ్యర్ధులను పిలుస్తామని రిజిస్ట్రార్ సత్యనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.