
33 జీవోకు సవరణలు చేస్తూ జీవో నంబర్ 150 విడుదల చేసిన ప్రభుత్వం
నాలుగు కేటగిరీల్లోని కేంద్ర, రాష్ట్ర సర్విసుల్లోని వారి పిల్లలకు అవకాశం
నేటి నుంచి 11వ తేదీవరకు ఆయా కేటగిరీల్లోని ఉద్యోగుల పిల్లలకు వర్సిటీలో రిజిస్ట్రేషన్ అవకాశం
మెడికల్ కౌన్సెలింగ్‌కు తొలగిన అడ్డంకులు...త్వరలో సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు సంబంధించి గత కొన్నినెలలుగా కొనసాగిన అనిశ్చితికి తెర పడింది. ఆల్ ఇండియా కోటా అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు రెండోవారం నుంచే ప్రారంభం కాగా, తెలంగాణ స్థానికత అంశంపై సుప్రీంకోర్టులో ఉన్న కేసు కారణంగా రాష్ట్రంలో స్టేట్ కోటా కౌన్సెలింగ్ మొదలు కాలేదు. అయితే స్థానిక అభ్యర్థుల నిర్వచనంపై సుప్రీంకోర్టు ఈ నెల 1న ఇచ్చిన తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచి్చన 33 జీవోకు సవరణలతో జీవో(నంబరు:15)ను సోమవారం విడుదల చేసింది.
ఈ ప్రభుత్వ ఉత్తర్వులతో స్టేట్ కోటా అడ్మిషన్లకు అడ్డంకులు తొలగి, కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైంది. ఈ మేరకు వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం 9 నుంచి 12వ తరగతి వరకు వరుసగా తెలంగాణలో చదవలేకపోయిన నాలుగు కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు సంబంధించి మంగళవారం నుంచి రిజి్రస్టేషన్లు ప్రారంభించనుంది. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఎంబీబీఎస్ స్థానిక కోటా అడ్మిషన్లకు అర్హులైన వారు ఈ నెల 11వ తేదీ వరకు యూనివర్సిటీకి వచ్చి రిజి్రస్టేషన్ చేసుకోవచ్చు. అనంతరం ర్యాంకర్ల జాబితాను విడుదల చేసి, ఈ నెల 15వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో స్టేట్ కోటా కౌన్సెలింగ్ ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని వర్సిటీ వీసీ డాక్టర్ నందకుమార్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ ధ్రువీకరించారు.
సుప్రీంకోర్టు తీర్పుతో ఊరట
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన అనంతరం ప్రభుత్వం రాష్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లోని సీట్లతోపాటు ప్రైవేటు కళాశాలల్లోని కనీ్వనర్ కోటా సీట్లను స్థానికులతోనే భర్తీ చేసే విధంగా గత సంవత్సరం జీవో 33ను తీసుకొచి్చంది. ఈ జీవో ప్రకారం 9,10 తరగతులతో పాటు ఇంటర్ (11,12) వరుసగా నాలుగేళ్లు ఇక్కడ చదివితేనే స్థానికులుగా పరిగణించబడతారు.
వారికే స్టేట్ కోటా కింద ప్రభుత్వ కళాశాలల్లోని 85 శాతం సీట్లు, ప్రైవేట్ కళాశాలల్లోని కనీ్వనర్ కోటాలోని 50 శాతం సీట్లు కేటాయిస్తారు. అయితే ఈ జీవోపై 2024లో కొందరు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించిన వారికి స్థానిక కోటా కింద సీట్లు కేటాయించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచి్చంది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈనెల 1న తీర్పు చెబుతూ, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. అదే సమయంలో తెలంగాణ స్థానికత గల నాలుగు కేటగిరీల్లోని ప్రభుత్వ ఉద్యోగుల సంతానానికి సంబంధించి ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది.
కొత్త జీవో ప్రకారం...
⇒ 4 కేటగిరీల్లోని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కనీసం నాలుగు సంవత్సరాలు తెలంగాణలోని విద్యా సంస్థల్లో చదివి ఉండాలి. ఒకవేళ చదవకపోయినా నాలుగు సంవత్సరాలు తెలంగాణలో నివసించి, రాష్ట్రంలోనే క్వాలిఫైయింగ్ పరీక్ష రాసి ఉండాలి.
⇒ కొత్త సవరణలు ఈ విద్యాసంవత్సరం నుంచే అమలులోకి వస్తాయి. స్థానిక అభ్యర్థి అర్హత నిరూపణకు తల్లిదండ్రుల ఉద్యోగ ధ్రువీకరణ పత్రాలు సమరి్పంచడం తప్పనిసరి.
వీరి పిల్లలకే ఈ అవకాశం
⇒ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు : ఇతర రాష్ట్రాలలో విధులు నిర్వర్తించిన కాలంలో.
⇒ ఆల్ ఇండియా సర్వీసెస్ (ఐఏఎస్/ ఐపీఎస్/ ఐఎఫ్‌ఎస్ మొదలైన) తెలంగాణ కేడర్ అధికారుల పిల్లలు.
⇒ తెలంగాణను స్వస్థలంగా ప్రకటించిన రక్షణ దళాలు, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ సిబ్బంది పిల్లలు.
⇒ తెలంగాణ ప్రభుత్వ అధీనంలోని కార్పొరేషన్లు, ఏజెన్సీలు, సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలు