
ప్రత్యేక కమిటీ భేటీకి అడ్డంకులు
ఎవరికివారే ఉప కమిటీలతో మంతనాలు
సమయం దగ్గర పడుతున్నా తేల్చని కమిటీ
ఈ ఏడాది ఫీజుల పెంపు ఉంటుందా?
ఆందోళనలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజులపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. కమిటీలో ఉన్న సభ్యులు ఎవరికి వారు ఉప కమిటీలు ఏర్పాటు చేసుకొని విడివిడిగా సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధాన కమిటీ సభ్యులు మాత్రం ఇంతవరకూ దీనిపై చర్చించలేదు. రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ వచ్చే మూడేళ్ల బ్లాక్ పీరియడ్‌కు ఇంజనీరింగ్ ఫీజులను ఖరారు చేసింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది.
అయితే, ఫీజుల పునఃపరిశీలనకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీని వేసింది. ఆడిట్, టౌన్‌ప్లానింగ్, సంక్షేమ శాఖ, సాంకేతిక, ఉన్నతవిద్య విభాగాల అధిపతులను ఈ కమిటీలో సభ్యులుగా చేర్చింది. గతవారం ఈ కమిటీ తొలిసారిగా భేటీ అయ్యి ప్రైవేట్ కాలేజీల అభిప్రాయాలను తెలుసుకుంది. ఆ తర్వాత ప్రతీ సభ్యుడు ఉప కమిటీలు వేసుకున్నారు. రెండోసారి సమావేశం ఇంతవరకూ చేపట్టలేదు. ఉన్నత విద్య, సాంకేతిక విద్య విభాగాల మధ్య సమన్వయం కొరవడినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ముందుకు... వెనక్కి
ఇంజనీరింగ్ కాలేజీల్లో మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, న్యాక్, ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకులను పరిగణనలోనికి తీసుకోవాలని ఉన్నతవిద్య అధికారులు భావించారు. ఈ దిశగా కసరత్తు మొదలు పెట్టారు. ఏ కాలేజీకి ఏ స్థాయిలో ర్యాంకులు వస్తున్నాయని పరిశీలిస్తున్నారు. సాంకేతిక విద్య ఉన్నతాధికారి కూడా ఈ కమిటీలో ఉన్నారు. వాస్తవానికి ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్య అధికారులు కలిసి జాతీయ ర్యాంకులను పరిశీలించాలి. కానీ సాంకేతిక విద్య అధికారులు మాత్రం జాతీయ ర్యాంకులతో పనే లేదని చెబుతున్నారు.
ప్రతీ ప్రైవేట్ కాలేజీ ఈ వ్యవహారంలో అనేక మార్గాల్లో వెళుతుందని, అలాంటప్పుడు వీటిని ప్రామాణికంగా తీసుకోవడం సరికాదంటోంది. సాంకేతిక విద్య అధికారులు అడ్డుపడుతున్న కారణంగా ఉన్నత విద్యామండలి అధికారులు ప్రతీ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. అంతర్గత కమిటీల సమావేశాలను కూడా మండలి కార్యాలయంలో నిర్వహించడం లేదు. అంతిమంగా మా నివేదిక మేం ఇస్తామని మండలి అధికారులు చెబుతున్నారు. సాంకేతిక విద్య అధికారులు కూడా తమ పరిశీలనను ప్రధాన కమిటీ ముందు వెల్లడించాల్సిన అవసరమే లేదంటున్నారు.
ఫీజుల సంగతేంటి?
ఇంజనీరింగ్ సీట్ల భర్తీ దాదాపు పూర్తికావొచ్చింది. కన్వీనర్ కోటా కింద ఇక స్పాట్ మాత్రమే మిగిలింది. ఇంత వరకూ ఫీజులపై తేల్చకపోవడంతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాది ఫీజులు ఖరారు చేయకపోతే నష్టపోతామని కాలేజీ యాజమాన్యాలు అంటున్నాయి. ఇప్పుడు ఖరారయ్యే ఫీజు వచ్చే నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సుకు వర్తిస్తుంది.
కౌన్సెలింగ్ సమయంలో పాత ఫీజులే తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఒకవేళ ఫీజులు పెంచితే అవి వర్తిస్తాయని కౌన్సెలింగ్‌లో పేర్కొనలేదు. ఇప్పుడు ఫీజులు పెంచినా విద్యార్థులకు ముందే చెప్పలేదు కాబట్టి వ్యతిరేకత వచ్చే వీలుందని యాజమాన్యాలు అంటున్నాయి. తాత్సారం చేయడంలో ఆంతర్యమేంటని యాజమాన్యాలు అధికారులను ప్రశ్నిస్తున్నాయి. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నాయి.