జిల్లా వాసులపై విద్యుత్‌ భారం


ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి విద్యుత్‌ చార్జీలు పెంచడానికి చర్యలు చేపట్టడంతో జిల్లా వాసులపై ఏడాదికి సుమారు రూ.40.30 కోట్ల మేరకు భారం పడనుంది. పేరుకు 0 నుంచి 2,700 యూనిట్ల వార్షిక విద్యుత్‌ వినియోగదారులకు చార్జీలు పెంచలేదన్న మాటే గానీ ప్రజలపైనే పెరిగిన చార్జీల భారం పరోక్షంగా పడనుంది. కాగా 2,700 యూనిట్లకు పైబడి యూనిట్ల విద్యుత్‌ను ఏడాదికి వినియోగించే గృహ వినియోగదారులపై ఆయా స్లాబులవారీగా విభజించి వారిపై సుమారు యూనిట్‌కు 10 నుంచి 26 పైసలు భారం మోపనున్నారు. జిల్లావ్యాప్తంగా కేటగిరి బి–2లో గృహేతర, వాణిజ్య వినియోగదారుల సర్వీసులపై వివిధ స్లాబులకు గాను 27 పైసల నుంచి 60 పైసల వరకు పెంచారు. మొత్తంగా 11.50 లక్షల సర్వీసుల్లో ఏడాదికి 2,700 యూనిట్ల విద్యుత్‌ వినియోగించే వినియోగదారులు సుమారు 9.50 లక్షలు ఉండగా, మరో లక్ష వ్యవసాయ వినియోగదారులున్నారు. వీరిని మినహాయించి సుమారు లక్ష వినియోగదారుల్లో 2,700 యూనిట్లకు పైబడి వినియోగించే వినియోగదారులు సుమారు 39 వేలు, వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులు సుమారు 40 వేలు, మత్స్య పరిశ్రమకు సంబంధించి మరో 10 వేల సర్వీసులు ఉండగా సుమారు 10 వేల స్థానిక సంస్థల సర్వీసులు ఉన్నాయి. ఎగువ తెలిపిన 10.50 లక్షల వినియోగదారులను మినహాయించి సుమారు 1 లక్ష మంది వినియోగదారులపైనే మొత్తం రూ.40.30 కోట్ల భారం పడుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే వీధిలైట్లు, ప్రజలకు కుళాయిల ద్వారా మంచినీటిని సరఫరా చేసేందుకు పంచాయతీలు, మున్సిపాలిటీలు వినియోగించే విద్యుత్‌ చార్జీలను కూడా పెంచడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా వాటి పరిస్థితి తయారవుతోంది. స్థానిక సంస్థలపై యూనిట్‌కు 19 నుంచి 27 పైసలు అదనపు భారం పడనుంది. ఇప్పటికే విద్యుత్‌ శాఖ అధికారులు బిల్లులు చెల్లించడం లేదనే కారణంతో వీధిలైట్లకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తుండగా, ప్రస్తుతం పెంచిన భారంతో స్థానిక సంస్థలు పూర్తిగా కుదేలయ్యే పరిస్థితి కనిపిస్తోంది. చిన్న చిన్న ఆధ్యాత్మిక కేంద్రాలకు కంటి తుడుపు చర్యగా యూనిట్‌కు 5 పైసలు తగ్గించిన ప్రభుత్వం పెద్ద ఆధ్యాత్మిక కేంద్రాలపై 34 పైసల భారం మోపుతోంది. ఒక విద్యార్థులకు చదువులు చెప్పే పాఠశాలలు, కళాశాలలను కూడా ప్రభుత్వం విడిచిపెట్టకుండా వాటిపై కూడా 28 పైసల భారం వేసింది. కాగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏటా విద్యుత్‌ ఛార్జీలు పెంచుతున్నప్పటికీ ఈ ఏడాది పెంచిన చార్జీలు అసాధారణంగా ఉన్నాయి. గత ఏడాది పెంచిన చార్జీలతో పోల్చితే ఈ ఏడాది దాదాపు 120 శాతం పెరిగాయి. గత ఏడాది పెంచిన చార్జీల భారం జిల్లా ప్రజలపై సుమారు రూ. 17 కోట్లు మాత్రమే పడగా ఈ ఏడాది రూ. 40 కోట్లకు పైబడి ఉండడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top