ఆదుకోమంటే అరెస్ట్ చేస్తారా ? | Sakshi
Sakshi News home page

ఆదుకోమంటే అరెస్ట్ చేస్తారా ?

Published Tue, Jul 12 2016 8:32 PM

cpm leader baburao takes on tdp govt

సీపీఎం రాజధాని కమిటీ కన్వీనర్ బాబూరావు
కార్మికులకు న్యాయం చేయాలంటూ ధర్నా
తాత్కాలిక సచివాలయం వద్ద ఉద్రిక్తత
ఐదుగురు నాయకులు అరెస్ట్


గుంటూరు : ప్రమాదానికి గురైన కార్మికులను ఆదుకోవాలని అడిగితే అరెస్ట్‌లు చేస్తారా? అంటూ రాజధాని ప్రాంత సీపీఎం సమన్వయ కమిటీ కన్వీనర్ సిహెచ్.బాబూరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాత్కాలిక సచివాలయం నిర్మాణంలో సోమవారం గోడ కూలిన సంఘటనలో ఐదుగురు కూలీలకు గాయాలైన సంగతి తెలిసిందే.

ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారికి న్యాయం చేయాలని కోరుతూ సీపీఎం కార్యకర్తలు సచివాలయంలో ఉన్న మంత్రి నారాయణకు మంగళవారం వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. మల్కాపురం వద్దనే పోలీసులు సీపీఎం నాయకులను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత పోలీసులు వారిని బలవంతంగా వ్యాన్‌ను ఎక్కించి అమరావతి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఎందరిని బలి చేస్తారు?
ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ.. సచివాలయ నిర్మాణంలో ఎంతమంది కార్మికులను బలి చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోతే గుట్టు చప్పుడు కాకుండా చేయాలని అధికారులు, మంత్రులు ప్రయత్నించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. సమాచారం తెలుసుకుని పోరాటం చేస్తే ఒకరికి రూ. 9 లక్షలు, మరొకరికి రూ. 20 లక్షలు నష్ట పరిహారం ఇచ్చారని బాబూరావు వివరించారు.

ఇప్పుడు జరిగిన ప్రమాదంలో గాయపడినవారికి పరిహారం ప్రకటించాలని కోరుతుంటే అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. ప్రమాదం జరిగినపుడు మంత్రి నారాయణ సచివాలయంలోనే ఉన్నారని, కనీసం బాధితులను కూడా ఆయన పరామర్శించ లేదన్నారు. ఇప్పటికైనా మంత్రి నారాయణ బాధితులకు కనీసం రూ. 10 లక్షలు నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

కార్మిక శాఖ పత్తాలేకుండా పోవడం వల్లే తాము బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాజధాని డివిజన్ కమిటీ కార్యదర్శి ఎం.రవి, సీఐటీయూ రాజధాని డివిజన్ కమిటీ కార్యదర్శి జె.నవీన్ ప్రకాష్, రాజధాని డివిజన్ కమిటీ యువజన ఉపాధ్యక్షులు లెనిన్, సీపీఎం డివిజన్ నాయకులు జె.వీర్లంకయ్య, రైతు నాయకులు పాబత్తుల వెంకటేశ్వరరావులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement