టీపీ తలనొప్పి!

టీపీ తలనొప్పి!


అక్రమాల నివారణకు అమల్లోకి   నూతన విధానం

డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్టర్లలో  అవగాహన లోపంతో సమస్యలు

చెక్‌పోస్టు వద్ద రోజుల తరబడి     నిలిచిపోతున్న బ్లాక్‌లిస్టు వాహనాలు

 


 

బీవీపాళెం(తడ): యూజర్ చార్జీల పేరుతో లారీ సిబ్బంది నుంచి చెక్‌పోస్టు సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడటాన్ని అరికట్టేందుకు వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్ శ్యామలరావు టీపీలను ఆన్‌లైన్ ద్వారా తెచ్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వాహనంతోపాటే ఈ వేబిల్లులు, ఈ టీపీలు తెచ్చుకోవడం వల్ల వాహనదారులు ఎక్కువ సమయం చెక్‌పోస్టులో ఆగకుండా వెళ్లేలా సమయం కలిసి వస్తుందని భావించారు. కానీ ప్రస్తుత ం ఈటీపీల వల్ల బ్లాక్‌లిస్టు వాహనాల సంఖ్య పెరుగుతూ, చిన్నచిన్న తప్పులు, తమకు సంబంధంలేని తప్పుల కారణంగా కూడా వాహనాలు రోజుల తరబడి నిలిచిపోతూ ఉండటంతో వాహనాదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.





 గతంలో ఇలా..

 గతంలో రూ.50 యూజర్ చార్జీ తీసుకుని చెక్‌పోస్టు డీఈఓలు(డేటా ఎంట్రీ ఆపరేటర్లు) డ్రైవర్లు ఇచ్చే, తెచ్చే సమాచారం ఆధారంగా తమ వ్యక్తిగత లాగిన్‌లో పొరపాట్లు లేకుండా టీపీలు నమోదు చేసేవారు. తప్పులు దొర్లినట్లు గుర్తిస్తే వెంటనే సవరించుకునే వెసులుబాటు ఉండేది. వాహనం నంబరులో పొరపాట్లు, ఎగ్జిట్ చెక్‌పోస్టు దాటే సమయంలో లోపాలను సరిదిద్దే అవకాశం ఉండేది. ఏప్రిల్ 1 నుంచి వచ్చిన నూతన విధానంతో ఈటీపీలు స్వయంగా తయారు చేసుకుని రావాల్సి వచ్చింది. అవగాహనలేని ట్రాన్స్‌పోర్టర్లు, డ్రైవర్లు చెక్‌పోస్టుకు వచ్చి అక్కడ ఉన్న ప్రైవేటు ఆన్‌లైన్ సెంటర్లలో ఈటీపీలు నమోదు చేయించుకుంటున్నారు. ఈ సమయంలో హడావిడి, డ్రైవర్లు ఇచ్చే సమాచారం లోపం ఉండటం వల్ల తప్పులు అధికంగా వస్తూ బ్లాక్‌లిస్టుకి కారణం అవుతున్నాయి. తమిళనాడుకి వెళ్లేందుకు తిరువూరులో ఎగ్జిట్ కావాల్సిన వాహనదారుడు అవగాహన లేకుండా చెన్నై వైపు ఎగ్జిట్ అయితే ఆవాహనం బ్లాక్ లిస్టులో పడిపోతుంది.





 గతంలో ఎగ్జిట్ చెక్‌పోస్టు మారినా సమయం, ఇతర వివరాలు పరిశీలించి డీఈఓ లాగిన్ ద్వారా వెళ్లే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ఏ చెక్‌పోస్టుపేరు నమోదు చేస్తే అక్కడే ఎగ్జిట్ అవ్వాల్సి ఉంది. కానీ అవగాహన లేని డ్రైవర్లు ఇచ్చే సమాచారంతో అవగాహన లేని నెట్ సెంటర్ల వారు తయారుచేసే ఈటీపీల కారణంగా బ్లాక్ లిస్టు పెరిగిపోతోంది. బీవీపాళెం చెక్‌పోస్టులో రెగ్యులర్ ఏఓ లేకపోగా ఇన్‌చార్జ్ ఏఓ సెలవుపై వెళ్లడంతో వాహనాల బ్లాక్ లిస్టులు పెరిగి పోతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు ఈటీపీలపట్ల అవగాహన పెంచుకునే వరకు అధికారుల సహకారంతో మీసేవ తరహాలో ఓ సెంటర్‌ని ఏర్పాటు చేసి తప్పులు లేని ఈటీపీలను తయారు చేసి ఇచ్చేలా ప్రణాళిక  సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.  దీనికి సంబంధించి డీసీ కృష్ణమోహన్‌రెడ్డిని వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top