శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై చర్చ సందర్భంగా విపక్షాల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అహంభావ పూరితంగా ఉందని...
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై చర్చ సందర్భంగా విపక్షాల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు అహంభావ పూరితంగా ఉందని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. గత సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చిన మాటను విపక్షాలు గుర్తు చేస్తే భరించలేక అధికార పక్షం సభను రేపటికి వాయిదా వేయించిందని ధ్వజమెత్తారు.
గడచిన ఏప్రిల్‌లోగా బకాయిలన్నీ చెల్లిస్తామని గత బడ్జెట్ సమావేశాల్లో హామీనిచ్చిన సీఎం కేసీఆర్, దానిని పూర్తి చేయకపోవడంప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని స్పష్టం చేస్తోందన్నారు. చట్ట సభలలో స్వయంగా సీఎం ఇచ్చిన హామీలే గాలి మాటలుగా మారడం నూతన తెలంగాణలో ఒక విపరీత పరిణామమని పేర్కొన్నారు. దీర్ఘకాలికంగా రూ.4,500 కోట్ల ఫీజుల బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రైవేట్ యాజమాన్యాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.