నా పేరు ఊట్ల సుబ్బలక్ష్మి. మాది శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం. నేను, నా భర్త ఊట్ల మల్లికార్జున చేనేతపైనే ఆధారపడి జీవించేవాళ్లం. మాకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు. అయితే 2015లో నా భర్త అప్పుల బాధ భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధర్మవరం వచ్చినప్పుడు మా కుటుంబాన్ని పరామర్శించి వ్యక్తిగతంగా రూ.లక్ష సాయం అందించారు. అధికారంలోకి వస్తే అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు.
ఆ మాట ప్రకారమే జగనన్న సీఎం కాగానే డిసెంబర్ 21న నేతన్న నేస్తం పథకం ప్రవేశపెట్టి ఒక్కో చేనేతకు ఏడాదికి రూ.24 వేలు అందించారు. అలాగే అప్పటి టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. జగనన్న సీఎంగా ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా మా నలుగురు పిల్లలను ఉన్నత చదువులు చదివించా.
నా పెద్ద కుమార్తె లావణ్య బీ.టెక్ పూర్తి చేసి సచివాలయ ఉద్యోగం సంపాదించింది. మరో ఇద్దరు ఆడపిల్లలు భావన పీజీ, బిందుమాధవి డిగ్రీ, కొడుకు మోహన్ డిప్లొమా పూర్తి చేశారు. నా భర్త మరణంతో వీధిన పడిన మా కుటుంబాన్ని జగనన్న చేయూత ఇచ్చి ఆదుకున్నారు. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాం. జగనన్న సాయం అందకుంటే మా పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తుంది. ఆయన పుట్టినరోజు మా అందరికీ పండుగ రోజు. – ధర్మవరం
కరోనా అల్లకల్లోలం సృష్టించినా.. జగన్ ‘చేయూత’
కరోనా కష్టకాలంలో ఎలా బతకాలిరా దేవుడా అని ఆలోచిస్తున్న మాబోటి కుటుంబాలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘చేయూత’ అందించారు. వైఎస్సార్ చేయూత పథకం వల్ల ఏటా రూ.18,500 చొప్పున అందింది. ఆ డబ్బుతోనే మా ఇంటిలో ఓ చిన్న కిరాణా దుకాణం పెట్టుకున్నా. స్వయం సహాయక సంఘంలో ఉండడంతో స్త్రీనిధి రుణం ద్వారా రూ.లక్ష, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.లక్ష తీసుకుని పెట్టుబడి పెట్టాను. ‘జగనన్న తోడు’ ద్వారా వచి్చన రూ.10వేలు వడ్డీ లేని రుణం కూడా మాకు వేన్నీళ్లకు చన్నీళ్లలా సాయపడింది.

దీంతోపాటు వైఎస్ జగన్ అందించిన ‘ఆసరా’ ఎందరో పొదుపు సంఘాల సభ్యులను రుణ విముక్తుల్ని చేసింది. నా భర్త సూర్యనారాయణతో గ్రామంలోనే టెంట్‌హౌస్ పెట్టించి ఉపాధి పొందుతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే జగనన్న హయాంలో నాలాంటి అక్కచెల్లెమ్మలు సంతోషంగా, ధైర్యంగా బతికారు. ఇదే మహిళా సాధికారతకు నిదర్శనం. కానీ 18 నెలలుగా మాకు ఆర్థికంగా ఉపయోగపడే ఒక్క సంక్షేమ పథకం అందలేదు. – సిరిపురం జ్యోతి, లొద్దపుట్టి, ఇచ్చాపురం మండలం, శ్రీకాకుళం జిల్లా


