కాల్‌మనీ కేసులో కళ్లు చెదిరే నిజాలు | Case filed on seven gang of call money | Sakshi
Sakshi News home page

కాల్‌మనీ కేసులో కళ్లు చెదిరే నిజాలు

Dec 12 2015 11:16 AM | Updated on Aug 10 2018 9:42 PM

కాల్‌మనీ కేసులో కళ్లు చెదిరే నిజాలు - Sakshi

కాల్‌మనీ కేసులో కళ్లు చెదిరే నిజాలు

అధికార పార్టీ అండదండలతో చీకటి దందా నడుపుతున్న కాల్‌మనీ ముఠాలో ఏడుగురిపై కేసు నమోదైంది.

విజయవాడ: అధికార పార్టీ అండదండలతో ఐదేళ్లుగా చీకటి దందా నడుపుతున్న కాల్‌మనీ ముఠాలో ఏడుగురిపై కేసు నమోదైంది. యలమంచిలి రామచంద్రమూర్తి అలియాస్‌ రాముతో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, నగర ప్రముఖులు కలిసి ఈ భాగోతాన్ని నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా.. అవసరాల్లో ఉన్న వారికి వడ్డీకి డబ్బులిస్తూ లోబరుచుకుని చీకటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు టాస్క్‌ఫోర్స్‌ పేర్కొంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌.. గుట్టుగా సాగుతున్న ముఠా చీకటి వ్యాపారంపై నిఘా పెట్టింది.

ఈ కేసులో యలమంచిలి రాము, భవానీ శంకర్‌, చెన్నుపాటి నివాస్‌, విద్యుత్‌ శాఖ డీఈ సత్యానంద్‌, టీడీపీ నేతలు వెనిగళ్ల శ్రీకాంత్‌, పెండ్యాల శ్రీకాంత్‌, దూడల రాజేష్‌పై కేసులు నమోదయ్యాయి. డబ్బు ముసుగులో మహిళల మానప్రాణాలతో ఆడుకుంటున్న వీరందరిపై.... ఐపీసీ సెక్షన్ 420, 376, 354a(1)(2), 384, 506, రెడ్‌విత్‌ 34, 120(బీ) కింద విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులంతా విజయవాడ పరిసర ప్రాంతాల్లోని అధికార పార్టీ నేతల అనుచరులుగా గుర్తించారు.

 

మరికొందరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. కాగా  కీలక సూత్రధారి అయిన వెనిగళ్ల శ్రీకాంత్‌కు విజయవాడ సమీప ఎమ్మెల్యేతో వ్యాపార సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వెలువెత్తాయి.  కాల్‌మనీ ముఠా డబ్బుతో సదరు ఎమ్మెల్యేను రెండు సార్లు విదేశాలకు పంపినట్టు పోలీసులు తెలిపారు. తాజాగా సదరు ఎమ్మెల్యేతోనే శ్రీకాంత్‌ ఉన్నట్టు సమాచారం.

గతంలో టీడీపీ ఎమ్మెల్యేలకు కాల్‌మనీ ముఠా సన్మానాలు చేసినట్టు తెలిసింది. దొంగనోట్ల ముఠాతో, కాల్‌మనీ ముఠాకు సంబంధమున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు జోక్యం చేసుకోకుండా స్థానిక సీఐ పోస్టింగ్‌ ఇప్పించుకున్నారని సమాచారం. గతంలో కాల్‌మనీ కార్యాలయాన్ని ఖాళీ చేయమని చెప్పిన ఇంటి యాజమానిపై దాడికి పాల్పడ్డారు. అయినా దీనిపై సదరు పోలీస్‌ అధికారి కేసు నమోదు నమోదు చేయలేదు. కాల్‌మనీ ముఠాకు సాయం చేస్తున్న పోలీస్‌ అధికారిపై పోలీస్‌ కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా  ఇప్పటికే నిందితుల్ని వదిలేయాలంటూ ఒత్తిళ్లు వచ్చినట్టు తెలిసింది. ఫైనాన్స్‌ వ్యాపారంలో ముసుగులో సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్న శ్రీరామ్మూర్తితో పాటు..... మరికొందర్నీ వదలాలంటూ కొందరు ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లు తీసుకొచ్చారని సమాచారం. ఈ దందాలో అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేతో పాటు....పలువురు టీడీపీ నేతలకు భాగస్వామ్యం ఉందని తెలిసింది. అయితే ఎమ్మెల్యే పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేకపోవడం అధికార పార్టీ ఒత్తిళ్లే కారణమని సమాచారం. ముఠా అంతర్గత గుట్టును బయటకు లాగేందుకు  అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు అంటున్నారు.

ఇదిలా ఉండగా, కాల్‌మనీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తన భర్తను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిర్బంధించారంటూ యలమంచిలి రాము భార్య హల్‌చల్‌ చేసింది. తన భర్తను వదిలేయాంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో సెర్చ్‌ వారెంట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. రామును అరెస్ట్‌ చేయలేదని, ఎక్కడున్నాడో తమకు తెలియదంటూ టాస్క్‌ఫోర్స్‌ వివరణ ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement