ఒకే భవనం.. రెండు కేంద్రాలు | Building Anganwadi center officials | Sakshi
Sakshi News home page

ఒకే భవనం.. రెండు కేంద్రాలు

Feb 27 2017 10:54 PM | Updated on Jun 2 2018 8:29 PM

మండలంలోని మచ్చుపేటలో ఒకే భవనంలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు.

ముత్తారం: మండలంలోని మచ్చుపేటలో ఒకే భవనంలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. శుక్రవారంపేటలో నిర్వహించాల్సిన అంగన్‌వాడీ కేంద్రం సంబంధిత అధికారులు నిర్లక్ష్యం కారణంగా మచ్చుపేటలోనే నిర్వహిస్తున్నారు. దీంతో రెండు అంగన్‌వాడీ కేంద్రాలు ఒకే భవనంలో నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. రెండు అంగన్‌వాడీ కేంద్రాల్లో  సుమారు 20 మంది చిన్నారులు ఉన్నట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు. శుక్రవారంపేటలో సుమారు 45ఇళ్లు, 200పై జనాభా, 130మంది ఓటర్లు ఉండగా అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లే వయస్సు గల చిన్నారులు 10మందికిపైనే ఉంటారు.

ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఇక్కడ విద్యార్థులు లేరనే సాకుతో ఇక్కడి అంగన్‌వాడీ కేంద్రాన్ని మచ్చుపేటలకు అనధికారికంగా తరలించగా, ఆ తర్వాత దీని విషయమే మర్చిపోయారు. దీంతో ఇద్దరు అంగన్‌వాడీ వర్కర్లు ఒకే భవనంలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్నా సంబంధిత అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో శుక్రవారంపేటకు చెందిన చిన్నారులకు అంగన్‌వాడీ విద్య అందకుండా పోతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు, బాలింతలకు, గర్భిణీలకు అందించాల్సిన పోషకాహారం వీలును బట్టి పంపిణీ చేస్తున్నారనే విమర్శలు వెలువడుతున్నారు.

అంతే కాక రెండు కేంద్రాలు ఒకే దగ్గర నిర్వహించడం వల్ల గ్రామంలోని దూరప్రాంతాల విద్యార్థులు అంగన్‌వాడీ కేంద్రాలకు రావడానికి నడక కష్టంగా మారుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి శుక్రవారంపేట అంగన్‌వాడీ కేంద్రం అక్కడే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. దీనిపై మంథని సీడీపీవో పద్మశ్రీని ‘సాక్షి’ వివరణ కోరగా శుక్రవారంపేట పేరిట ఉన్న అంగన్‌వాడీ కేంద్రం మచ్చుపేటలో నిర్వహిస్తున్నట్లు తనకు తెలియదని, దీనిపై వీలైనంత త్వరగా రెండు గ్రామాలను సందర్శించి పరిస్థితి పరిశీలించి సాధ్యాసాధ్యాల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement