హైదరాబార్ ఎస్‌ఆర్నగర్లో ఇంటికి వేసిన తాళం వేసినట్టే ఉంటున్నాయి. కానీ, ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు మాత్రం మాయమవుతున్నాయి.
ఎస్‌ఆర్ నగర్: హైదరాబార్ ఎస్‌ఆర్నగర్లో ఇంటికి వేసిన తాళాలు వేసినట్టే ఉంటున్నాయి. కానీ, ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు మాత్రం మాయమవుతున్నాయి. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా... చోరీకి పాల్పడుతున్న బీటెక్ విద్యార్థి ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధురానగర్‌లో నివసించే రాహుల్ బీటెక్ చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడిన రాహుల్... తాను నివసించే ప్రాంతంలో ఓ ఇంటి యజమానులు బయటకు వెళ్లేటప్పుడు తాళం వేసి కీని చెప్పుల స్టాండ్ పక్కన పెట్టి వెళుతుండటాన్ని గమనించాడు.
గతేడాది డిసెంబర్‌లో ఆ ఇంట్లోకి ప్రవేశించి 30 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించాడు. తిరిగి వారం రోజుల క్రితం మళ్లీ అదే ఇంటి లోపలికి ప్రవేశించి 15 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు చోరీ చేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. స్థానిక వ్యక్తుల పనిగా అనుమానించిన పోలీసులు నిఘా పెట్టి రాహుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించడంతో రెండు చోరీలు తానే చేసినట్టు అంగీకరించాడు. అతని వద్ద నుంచి రూ.10 లక్షల విలువ జేసే 45 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పంజాగుట్ట ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.