సీఎం రాకకు ఏర్పాట్లు పూర్తి | arrangements completed for cm tour | Sakshi
Sakshi News home page

సీఎం రాకకు ఏర్పాట్లు పూర్తి

Aug 13 2016 9:41 PM | Updated on Sep 4 2017 9:08 AM

సీఎం రాకకు ఏర్పాట్లు పూర్తి

సీఎం రాకకు ఏర్పాట్లు పూర్తి

ఇటీవల మాతృవియోగం కలిగినఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్‌ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

  • 800 మంది పోలీసులతో గట్టి బందోబస్తు
  • వర్షం కురిసినా ఇబ్బందులు లేకుండా రెయిన్‌ఫ్రూఫ్‌ టెంట్‌ ఏర్పాటు
  • ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా ఎమ్మెల్యే వ్యవసాయక్షేత్రానికి చేరుకోనున్న సీఎం
  • అక్కడి నుండి ప్రత్యేక వాహనశ్రేణిలో ఎమ్మెల్యే ఇంటికి..
  • నాగిరెడ్డిపేట,తాడ్వాయి : ఇటీవల మాతృవియోగం కలిగినఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిని పరామర్శించేందుకు సీఎం కేసీఆర్‌ రానున్న సందర్భంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి తల్లి ఏనుగు రాజమ్మ ఈ నెల 6న రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్వగ్రామం తాడ్వాయి మండలం ఎర్రపహాడ్‌లో ఆదివారం దినకర్మ నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్‌ హాజరై ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఇందుకోసం అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం ఎర్రపహాడ్‌కు వచ్చిన సమయంలో వర్షం కురిసినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండాప్రత్యేకంగా రెయిన్‌ఫ్రూఫ్‌ టెంట్‌ను ఎమ్మెల్యే ఇంటివద్ద ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో ఎర్రపహాడ్‌ శివారులో గల ఎమ్మెల్యే వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. అక్కడి నుండి ప్రత్యేకవాహన శ్రేణిలో ఎమ్మెల్యే ఇంటికి వెళ్తారు. అక్కడ ఎమ్మెల్యే తల్లి రాజమ్మ చిత్రపటం వద్ద సీఎం కేసీఆర్‌ నివాళులర్పించి ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డిని, ఇతర కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ఎమ్మెల్యే ఇంటివద్దే మంత్రులతో కలిసి భోజనం చేసిన అనంతరం మధ్యాహ్నం 2గంటల సమయంలో సీఎం తిరిగి రాజధానికి వెళ్తారని అధికారులు తెలిపారు.
    800 మంది పోలీసులతో బందోబస్తు 
    సీఎం రాక సందర్భంగా ఎర్రపహాడ్‌లో 800 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మెదక్‌ అడిషనల్‌ ఎస్పీ వెంకన్న ఆధ్వర్యంలో పోలీసులు సీఎంకు బందోబస్తు నిర్వహించనున్నారు. ఆరుగురు డీఎస్పీలు, 12 మంది సీఐలు, 32 మంది ఎస్సైలతోపాటు సుమారు 700 మందికిపైగా కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొననున్నారు. బందోబస్తులో భాగంగా ప్రత్యేక పోలీసు బృందాలు శనివారం ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి ఇంటి పరిసరాలను జాగిలాలతో తనిఖీ చేశాయి. కలెక్టర్‌ యోగితారాణా, జేసీ రవీందర్‌రెడ్డి, ఎస్పీ విశ్వప్రసాద్‌ సీఎంరాక కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం రాకకు సంబంధించి ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డితో చర్చించారు. కాగా పార్టీ కార్యకర్తలకు, ఆరుమండలాలకు చెందిన ప్రజాప్రతినిధులకు వ్యవసాయక్షేత్రంలోని హెలిప్యాడ్‌ సమీపంలో భోజనాలకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.  

     

Advertisement
 
Advertisement
Advertisement