చీరలు, పంచెల్లో.. రూ. కోటి మూటగట్టుకున్నారు! | apco scam in amaravati foundation ceremony | Sakshi
Sakshi News home page

చీరలు, పంచెల్లో.. రూ. కోటి మూటగట్టుకున్నారు!

Oct 29 2015 9:17 AM | Updated on Mar 28 2019 5:39 PM

రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబాలకు అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఆహ్వానపత్రంతో పాటు ఇచ్చిన చీరె, ధోవతుల కొనుగోలులో రూ.కోటి నిధులు దుర్వినియోగమయ్యాయని తెలుస్తోంది.

విజయవాడ : రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబాలకు అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఆహ్వానపత్రంతో పాటు ఇచ్చిన చీరె, ధోవతుల కొనుగోలులో రూ.కోటి నిధులు దుర్వినియోగమయ్యాయని తెలుస్తోంది. మంగళగిరికి చెందిన ఇద్దరు అధికార పార్టీ కీలక నేతలు ఆప్కో నుంచి వస్త్రాలు ప్రొక్యూర్ చేసే విషయంలో హస్తలాఘవాన్ని ప్రదర్శించి పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని మింగేసినట్లు విమర్శలు వె ల్లువెత్తుతున్నాయి. రాజధానికి భూములిచ్చిన రైతు కుటుంబాలకు ఆహ్వానపత్రంతో పాటు చీరె, ధోవతులు, స్వీటు బాక్సు ఇచ్చి వారిని సంప్రదాయపద్ధతిలో గౌరవంగా ఇంటికెళ్లి ఆహ్వానించాలని సీఎం చంద్రబాబునాయుడు జిల్లా అధికారులకు సూచించారు.
 
 ఇందుకోసం గుంటూరు జిల్లా అధికారులు 21,942 మందిని ఎంపిక చేశారు. వీరికి రూ.1600 విలువ చేసే చీరె, జాకెట్టు, పంచె, కండువాలను అందజేయాలని నిర్ణయించారు. వీటన్నింటినీ సమకూర్చే బాధ్యతను ఆప్కో సంస్థకు అప్పగించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా చేనేత సంఘాలను ఆదుకున్నట్లవుతుందని ప్రభుత్వం భావించింది. అయితే కొందరు అధికారులు, ఆప్కో ప్రతినిధులు దీన్ని చక్కగా వాడుకున్నారు. మంగళగిరికి చెందిన ఇద్దరు అధికార పార్టీ కీలక నేతలు తమ దగ్గరున్న చేనేత చీరల నిల్వలతో పాటు తమ బంధుగణానికి చెందిన నిల్వలను కూడా ఆప్కో ద్వారా సరఫరా చేసినట్లు తెల్సింది.
 
 ఆప్కో అధికారుల చేతివాటం
 ఆప్కో సంస్థ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న చేనేత సంఘాల నుంచి చీరెలు, ధోవతులు సేకరించి సరఫరా చేయాల్సి ఉండగా కొన్ని జిల్లాల్లో పవర్‌లూమ్ వస్త్రాలను కూడా సేకరించినట్లు తెలిసింది. మార్కెట్లో చేనేత వస్త్రాల కంటే పవర్‌లూమ్ వస్త్రాలు తక్కువ ధరకే లభిస్తాయి. దీంతో పలు జిల్లాల నుంచి సేకరించిన పవర్‌లూమ్ వస్త్రాలకు చేనేత లోగోలను అంటించి పంపిణీకి అందజేశారని సమాచారం. దీంతో నాసిరకం చీరెలు, ధోవతులు తెర మీదకు వచ్చాయి.
 
 మార్కెట్లో రూ.150 ధరకే లభించే పంచెలను రూ. 500 లకు కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపించిన ఆప్కో ఉద్యోగులతో పాటు వీటిని పంపిణీకి ఆమోదించిన జిల్లా అధికారులకూ పెద్ద మొత్తంలో డబ్బు ముట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. చీరెలు, పంచెల కొనుగోళ్లలో మొత్తం రూ.1 కోటి వరకూ నిధులు దుర్వినియోగం అయినట్లు తెలుస్తోంది. అనంతవరం, బోరుపాలెం, అబ్బరాజుపాలెం గ్రామాల మహిళలు పంపిణీ చేసిన చీరెలు మాకొద్దని అసంతృప్తి వ్యక్తం చేసి ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జరిగిన మోసాలపై ధ్వజమెత్తింది.
 
ప్రభుత్వాన్ని మోసం చేసిన ఆప్కో అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. పవర్‌లూమ్ చీరెలకు హ్యాండ్‌లూమ్ లోగోను కుట్టి రైతు కుటుంబాలకు సరఫరా చేయడం జరిగిందనీ, దీనిపై విచారణ జరిపించాలనీ, బాధ్యులైన ఆప్కో అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ చేనేత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement