మొండి ఘటాలు!

మొండి ఘటాలు! - Sakshi


కడప నగర పాలక  సంస్థలో సగం కూడా వసూలు కాని పన్నులు

అధికార పార్టీ అండతో మొండి కేస్తున్న బడా నేతలు

ఎక్కువ మొత్తంలో బకాయిలన్నీ వారివే

ఇరువైపులా ఒత్తిడితో రెవెన్యూ సిబ్బంది సతమతం


 కడప కార్పొరేషన్ : ఓ వైపు 2015-16 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు వచ్చినా కడప నగర పాలక సంస్థలో మాత్రం పన్నులు సగం కూడా వసూలు కాలేదు. నగరంలోని ప్రైవేట్ ఆస్తుల నుంచి రావలసిన పన్ను రూ.22 కోట్లకు పైగా ఉండగా, ప్రస్తుతం రూ.12 కోట్లు మాత్రమే వసూలైంది. కేంద్ర, రాష్ట్ర కార్యాలయాల నుంచి కూడా రూ.15 కోట్లు రావలసి ఉంది. కడప నగరంలో పేరు, పలుకుబడి ఉన్న అధికార పార్టీ నేతలే ఎక్కువ మొత్తంలో పన్నులు బకాయిపడి చెల్లించకుండా మొండికేస్తున్నారని కార్పొరేషన్ వర్గాలు వాపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలైన ఆర్‌అండ్‌బీ, హరిత, ఇతర కార్యాలయాల నుంచి కూడా పెద్ద మొత్తంలో పన్ను వసూలు కావలసి ఉంది. మార్చి అఖరు నాటికి 100 శాతం కలెక్షన్ చేయాలని మున్సిపల్ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు ఒకవైపు, మరోవైపు అధికారపార్టీ నేతల మొండి వైఖరి, బెదిరింపులతో నగర పాలక రెవెన్యూ అధికారులు, సిబ్బంది సతమతమవుతున్నారు.


పెద్దమొత్తంలో పన్ను బకాయిపడ్డ వారి సంస్థలు, ఇళ్ల ముందు ఆందోళన నిర్వహిస్తున్నా ఆశించినంత ఫలితం కనిపించడం లేదు. బకాయిలు వసూలు చేసేందుకు రెవెన్యూ సిబ్బంది వెళితే రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్న వారి నుంచి కమిషనర్‌కు ఫోన్లు చేయిస్తూ తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇలాగేతై పన్నులు వసూలు చేయడం తమ వల్ల కాదని నగర పాలక సంస్థ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదేళ్లు వరుసగా ఆస్తి పన్నుపై వడ్డీ మినహాయించారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం లోటు బడ్జెట్‌ను సాకుగా చూపి ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం లేదు.


దీంతో చాలా మంది బకాయిదారులు వడ్డీ మాఫీ అవుతుందనే ఆశతో పన్ను చెల్లించకుండా మొండికేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వారికి డిమాండ్ నోటీసులు, రెడ్ నోటీసులు, ట్యాప్ కనెక్షన్ నోటీసులు, ఆక్యుపై నోటీసులు జారీ చేశారు. ఆస్తులు వేలం వేసైనా పన్నులు రాబట్టాల్సిందేనని ఉన్నతాధికారులు జప్తు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పూర్తి స్థాయిలో  పన్నులు వసూలు చేసేందుకు కృషి చేస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ పి. చంద్రమౌళీశ్వర్‌రెడ్డి తెలిపారు. సెలవు రోజుల్లో కూడా పన్ను చెల్లించేందుకు అవకాశం కల్పించామన్నారు. 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top