వొడాఐడియాకు రిలీఫ్
పునరాలోచనకు కేంద్రానికి అనుమతి
యూజర్ల ప్రయోజనాలరీత్యా ఉత్తర్వులు
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం వొడాఫోన్‌ఐడియాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. దాదాపు రూ. 5,606 కోట్ల స్థూల ఆదాయ బకాయిల (ఏజీఆర్) విషయాన్ని కేంద్రం పునరాలోచించేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. ప్రస్తుతం కంపెనీలో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని, సుమారు 20 కోట్ల మంది యూజర్లు వొడాఐడియా సర్వీసులపై ఆధారపడి ఉన్నారని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా కంపెనీ లేవనెత్తిన అంశాలను పరిశీలించేందుకు కేంద్రం సుముఖంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కంపెనీలో ప్రభుత్వం ఇప్పటికే భారీగా ఇన్వెస్ట్ చేయడంతో పాటు కోట్లాది మంది కస్టమర్లపై ప్రభావం పడనున్న నేపథ్యంలో ఏజీఆర్ అంశాన్ని కేంద్రం పునఃపరిశీలించి, తగు చర్యలు తీసుకుంటే తమకే అభ్యంతరం లేదని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడుకున్న బెంచ్ పేర్కొంది.
ఈ విషయంలో 2019లోనే సుప్రీంకోర్టు నిర్దిష్టంగా తీర్పునిచ్చిన తర్వాత 2016–17 ఆర్థిక సంవత్సరానికి టెలికం శాఖ అదనంగా రూ. 5,606 కోట్ల బాకీలను డిమాండ్ చేయడం సరికాదని కంపెనీ తరఫున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ వాదనల సందర్భంగా తెలిపారు. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం చార్జీల కింద టెల్కోలు కట్టాల్సిన మొత్తాన్ని లెక్కించేందుకు టెలికంతో పాటు టెలికంయేతర ఆదాయాలను కూడా కేంద్రం ప్రాతిపదికగా తీసుకోవడం (ఏజీఆర్) ఈ వివాదానికి దారి తీసింది.
తమపై అదనపు భారానికి కారణమయ్యే, టెలికంయేతర ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకోవద్దంటూ టెల్కోలు కోరినప్పటికీ, సుప్రీంకోర్టు మాత్రం ప్రభుత్వ పక్షానే నిలుస్తూ 2019లో ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, 2016–17కి సంబంధించిన బాకీలంటూ టెలికం శాఖ నుంచి మరో రూ. 5,606 కోట్ల కోసం డిమాండ్ నోటీసు రావడంతో, వొడాఐడియా.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపైనే తాజాగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
టెలికం శాఖతో కలిసి పనిచేస్తాం
సుప్రీంకోర్టు ఆదేశాలపై వొడాఫోన్ ఐడియా హర్షం వ్యక్తం చేసింది. ఇది తమకు సానుకూల పరిణామమని, దీనితో డిజిటల్ ఇండియా విజన్‌కు మరింత దన్ను లభిస్తుందని పేర్కొంది. దాదాపు 20 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్ ప్రయోజనాలను కాపాడే విధంగా ఏజీఆర్ సంబంధ అంశాల పరిష్కారానికి టెలికం శాఖతో కలిసి పనిచేస్తామని తెలిపింది.
బీఎస్‌ఈలో షేరు ధర 4% పెరిగి రూ. 9.99 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 10 శాతం దూసుకెళ్లి రూ. 10.57 గరిష్ట స్థాయిని కూడా తాకింది.


